ఒకటే దేశం కానీ బద్ద శత్రువుల లాగా కొట్టుకు చస్తున్నారు. కారణం ఎక్కడో ఉంటుంది ఆ కారణానికి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి దెబ్బలు తింటూ ఉంటాడు. సందర్భం ఏదో ఉంటుంది ఆ సందర్భాన్ని గురించి కనీస అవగాహన లేని వ్యక్తి వాహనం తగలబడుతూ ఉంటుంది. ఇది ప్రస్తుతం కర్ణాటక - తమిళనాడు ల మధ్యన రేగుతున్న అతిపెద్ద వివాదం తాలూక మకిలీ. కేవలం " నీరు " అనే ఒక అంశం కోసం ఎంత రచ్చ జరుగుతుందో రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ రోజు ప్రభుత్వాలకి చూపిస్తున్నారు. కావేరీ జలాల సమస్య ఈనాటిది కానే కాదు.దశాబ్దాల కాలం నుంచీ రెండు రాష్ట్రాల మధ్యనా చిచ్చు రేపుతున్న ఈ వ్యవహారం ఏ మాత్రం ఊహించని పరిణామాలు సృష్టిస్తోంది. మొదట బెంగళూరు లో మొదలైన ఈ రచ్చ అలా పాక్కుంటూ రివెంజ్ బాట లో చెన్నయి చేరుకుంది. బెంగళూరు లో తమిళ విద్యార్ధి మీద కన్నడిగులు అమానుషంగా దాడి చెయ్యగా దానికి ప్రతీ కారంగా చెన్నయి లోని ఊడ్ ల్యాండ్ హోటల్ ( కన్నడిగులది) మీద పెట్రోల్ బాంబ్ దాడి చేసారు తమిళులు. అప్పుడు మొదలైన ఈ దారుణాలు ఒకటా రెండా నిన్న ఉదయం నుంచీ ప్రస్తుత తరుణం వరకూ సాగుతూనే ఉన్నాయి. మధ్యాన్నం ఎప్పుడైతే తమిళనాడు వారికి మరిన్ని జలాలు ఇవ్వాల్సిందే అంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందో కన్నడిగులు మరింత రెచ్చిపోయారు.కావేరీ పరివాహక ప్రాంతాలన్నింటిలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది.

తమిళనాడుకు వ్యతిరేకంగా వీధుల్లోకి దూసుకొచ్చిన కన్నడిగులు నినాదాలు ఇచ్చారు.  నగర్ కూడళ్ళలో టైర్లు కాలుస్తూ రవాణా ని పూర్తిగా ఆపేశారు. 12000 క్యూసెక్కుల నీరు తమిళనాడు కి కావేరీ నుంచి వదలాలి అన్న ఒకే ఒక్క సుప్రీం తీర్పు మొత్తం ఘటన కి నందిగా మారింది. సోషల్ మీడియా ,వాట్స్ యాప్ సహకారం తో రెచ్చిపోయిన అల్లరి మూకలు వైరల్ గా గొడవ గొడవ చేస్తున్నారు. తమిళనాడు లో కన్నడిగుల మీద తీవ్ర దాడి జరిగింది. ఒక కర్నాటక మినీ వ్యాన్ ని రోడ్డు మీదనే ఆపి అద్దాలు పగలగొట్టి మంట పెట్టి అందులోని డ్రైవర్ ని కిందకి దింపి కర్రలతో ,చేత్తో విపరీతంగా కొట్టిన వీడియో సంచలనంగా మారింది. ఆ వీడియో విపరీతంగా స్ప్రెడ్ అయిన కొద్ది సేపట్లోనే కర్ణాటక లో నిరసనలు వెల్లువెత్తాయి. " TN " అనే నెంబర్ ఉన్న ప్రతీ కారు , బైక్, వెహికల్ నీ ఒదలలేదు కర్ణాటకా జనాలు.  మొత్తం 12 లారీలతో పాటు.. 20 వోల్వో బస్సులు ఆందోళనకారుల చేతిలో దగ్థమయ్యాయి. దీంతో బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పౌరజీవనం పూర్తిగా స్తంభించింది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఖచ్చితంగా మీడియా అని చెప్పాలి. చూపించిందే పది సార్లు చూపించి జనాలని రెచ్చగొట్టే బాధ్యత కర్ణాటక మీడియా తీసుకుంది.

జరిగిన విధ్వంసానికి ఇవాళ కాకపోతే రేపు పోలీసులు సరైన రీతిలో ప్రయత్నించి పట్టుకుంటే ఆ ఆందోళన కారులు , ఆ కర్ణాటక వ్యక్తిని తమిళనాడులో కొట్టిన వారు దొరికి తీరతారు కానీ బెంగళూరు జనాలని రెచ్చగొట్టడానికి అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మీడియా లో పడే పడే అదే వీడియో చూపించడం వలన పరిస్థితి పోలీసుల చెయ్యి దాటిపోయింది. దీనికి తోడు సోషల్ మీడియా అయిన ఫేస్ బుక్ , వాట్స్ యాప్ లలో జరగనివి జరిగినట్టుగా అంటే " కర్ణాటక అమ్మాయిని తమిళనాడు లో కుర్రాళ్ళు రేప్ చేసారు .. రివెంజ్ తీర్చుకుందాం పదండి " ఇలాంటి ఫార్వార్డ్ మెసేజీ లు పెట్టి మరింత విధ్వంసం రేపారు. కర్ఫ్యూ లేకపోయినా కర్ఫ్యూ నడుస్తోంది అంటూ జనాలని భయపెట్టింది మీడియా. ఈ దెబ్బతో రవాణా వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతోంది. బెంగళూరులో మెట్రో రైల్ ను నిలిపివేశారు. మహానగర బస్సులతో పాటు రాష్ట్ర రవాణా సంస్థలకు చెందిన బస్సుల్ని నిలిపివేశారు.మాండ్య జిల్లా మద్దూరు దగ్గరి నగరగెరె గ్రామానికి చెందిన వైరముడి అనే యువకుడు కాలుతున్న టైర్ల మధ్యకు దూకి ఆత్మాహుతికి ప్రయత్నించాడు.

ప్రస్తుతం అతను ఆసుపత్రి లో ఉన్నాడు. చివరకి ఈ గొడవల వలన , తమిళ నాడు ఆరాధ్య దైవం - సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంటిమీద కూడా దాడి జరిగే అవకాశం ఉంది అని భయపడుతున్నారు పోలీసులు. ఆయనకి ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు. ఆయన పుట్టింది మహారాష్ట్రలో అయినా కొంతకాలం కర్ణాటకలో పని చేశారు. ఆయన కన్నడిగ నేపథ్యంతో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. చాలా కాలం కిందటే రజనీకాంత్ తమిళనాడులో స్థిరపడినప్పటికీ తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో.. ఆయనపై దాడి జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా ఆయనకు రక్షణను మరింత పెంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: