రాష్ట్ర సహకార ఎన్నికల్లో అనూహ్యరీతిలో కాంగ్రెస్‌ ముందంజలో ఉండటంతో కిరణ్‌ ప్రభుత్వంపై రైతులు, ప్రజలు వ్యతిరేకంగా లేరని భావిస్తున్న కేంద్రం 2014 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తుంది. ఉన్నపళంగా 2009 లో చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి సీమాంధ్రలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెంచుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దన్న సూచనలను అధిష్ఠానం పరిగణలోకి తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గెలుపు లక్ష్యంగా ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. అందుకని తెలగాణ రాష్ట్ర ప్రకటన ఇప్పుడు చేయకుండా 2014 తర్వాత చూద్దామని, అప్పటి వరకు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం బోడోల్యాండ్‌ తరహాలో ప్రాదేశిక మండలిని ఏర్పాటు చేయాలని, దానికి ఇన్‌ఛార్జీ బాధ్యతలు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి అప్పగిస్తే ఎలా ఉంటుందనే విషయంపై కేంద్రం పరిశీలిస్తోందని సమాచారం. ఈనెలలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ అభివృద్ధి మండలి, ప్రత్యేక నిధుల అంశాన్ని ప్రకటించనుందని అంటున్నారు. కాగా, రాష్ట్ర సిఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డిని కొనసాగిస్తూనే కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి తెలంగాణ అభివృద్ధి మండలి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల రెండు ప్రాంతాల్లోని రెడ్లు వైఎస్సార్సీ అధినేత జగన్‌ వైపు జారీపోకుండా చూసుకోవచ్చునని లెక్కలు వేస్తున్నారు. అదీగాక తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఉండటం వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ ప్రాంతాల అభివృద్ధి పనులపై దృష్టి పెడతారని అంటున్నారు.  సిఎం కిరణ్‌ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు, పిసిసి చీఫ్‌గా తెలంగాణ ప్రాంతం నుంచే నియామకం చేయాలని డిమాండ్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానానికి ఎంతో నమ్మకస్తుడైన డి. శ్రీనివాస్‌నే మళ్లీ పిసిసి చీఫ్‌గా నియామకం చేస్తే బాగుంటుందనే భావన ఢిల్లీ పెద్దల్లో ఏర్పడిందని అంటున్నారు. కాగా, యువనేత, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్త ఫార్ములా ప్రకారం జోడు పదవులు ఉండకూడదు. ఈ మేరకు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ పిసిసి చీఫ్‌ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. తాజాగా సిఎం జంప్‌ జలానీలను దృష్టిలో పెట్టుకుని వినాశకాలే విపరీత బుద్దీ అని వ్యాఖ్యానించారు. పాత నీరు పొతే కొత్త నీరు వస్తుందని పేర్కొన్నారు. ఆయన లక్ష్యం కూడా వచ్చే ఎన్నికల్లో కొత్తవారికే టిక్కెట్లు ఇవ్వడం. 2004,2009 ఎన్నికల్లో కూడా కొత్తవారికి టిక్కెట్లు ఇచ్చినందుకే కాంగ్రెస్‌ గెలిచిందని ఆయన విశ్లేషణ.తెలంగాణ ప్రాంత ఉద్యమాల్లో, సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొనే యువతను ఆకర్శించేందుకు ప్రత్యేక శ్రద్ద చూపాలని పలువురు కాంగ్రెస్‌ నేతలకు సంకేతాలు అందాయని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: