రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్తు ఉద్యమం చేపడుతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ప్రకటించారు. ఎప్పుడు చూసినా తెలంగాణ, సమైక్య ఉద్యమాలను పట్టుకుని తిరగడం వదిలేసి ప్రజల కష్టాలను విపక్ష నాయకులు పట్టించుకోవాలన్నారు. పెంచనున్న ఛార్జీలను రద్దు చేయాలన్న డిమాండుతో చేపట్టే ఉద్యమంలో పాల్గొనేందుకు అన్ని పార్టీలనూ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి రూ. 10 వేల కోట్లను అదనంగా వసూలు చేసిందన్నారు. ఏప్రిల్ నుంచి మరో రూ.12,700 కోట్ల వసూళ్లకు రెగ్యులేటరీ కమిటీ విచారణ చేపడుతోందన్నారు. ఇదయ్యాక ఛార్జీలు పెంచడానికి కార్యాచరణ సిద్ధమైందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాయ మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఇంధనం సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండు చేశారు. తమ విద్యుత్ ఉద్యమానికి అన్ని పార్టీల నాయకులూ రావచ్చని,వారు రాకున్నా తమ పోరాటం సాగిస్తామని తెలిపారు. విద్యుత్ కోతలతో గ్రామాలు చీకటిమయం కావడంతో నల్లజెండాలను ఆవిష్కరించి ఉద్యమాలను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల విద్యుత్ ఛార్జీల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే ఉత్తుత్తి పాదయాత్రలతో మిగిలేది కాళ్లు నొప్పులేనని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: