2030 నాటికి అన్ని రంగాల్లోనూ భారత్ అగ్ర రాజ్యాల్లో ఒకటిగా ఉంటుందని,భారత్ విజయ ప్రస్థానం ఈ శతాబ్దం అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తుందని కామెరన్ అన్నారు. భారత్‌తో ఉన్న బంధాన్ని ముందుకు తీసుకుపోవాలన్న కాంక్షతో తాను ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం అభివృద్ధికి అవరోధంగా ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని ఆయన పిలుపునిచ్చారు. రతన్ టాటా, ముకేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, సైరస్ మిస్త్రీ లాంటి భారతీయ కార్పొరేట్ దిగ్గజాలు బ్రిటన్ ప్రధానితో సమావేశమయ్యారు. భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన డేవిడ్ కామెరన్ తొలిరోజు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు భారీ వ్యాపార ప్రతినిధుల బృందం కూడా ఉంది. భారత్-బ్రిటన్ సంబంధాల్లో ఆకాశమే హద్దని ఆయన అన్నారు. బ్రిటన్‌లో పెట్టుబడి పెట్టే భారతీయ వ్యాపారులకు ఒకే రోజులో వీసాలు జారీ చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో భారత మార్కెట్లో ప్రవేశించడానికి బ్రిటన్ కంపెనీలకు అవకాశాలు కల్పించాలని కోరారు. బ్రిటన్ కంపెనీలు భారత బ్యాంకింగ్, రిటై ల్ రంగాల్లో ప్రవేశించాలని అనుకుంటున్నాయని తెలిపారు. గురువారం నాడు ఢిల్లీ వెళ్లి ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: