కన్నవారిని కోల్పోయి బిక్కు బిక్కుమంటూ ఒక్కడే మిగిలిపోయిన పన్నెండేళ్ల బాలుడతడు, బాలచంద్రన్ ఎల్టీటీఈ అధిపతి ప్రభాకరన్ చిన్న కుమారుడు. 2009 మే నెలలో అంతర్యుద్ధం చివరి అంకంలో అయినవారంతా శ్రీలంక సైన్యం తూటాలకు బలై ఎల్టీటీఈ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది.ఈ సంచలన వార్తను బ్రిటన్ కు చెందిన ఛానల్ 4 బయటపెట్టింది.  తమ చేతికి చిక్కిన ఆ బాలుణ్ని 'నో వార్ జోన్'లోని ఓ బంకర్‌లో చెక్కబెంచీపై కూర్చోబెట్టారు. పిల్లాడు నిక్కరు మాత్రం వేసుకున్నాడు. పైన చొక్కాలేదు, కేవలం ఓ లుంగీ కప్పుకున్నాడు. అమాయకంగా చూస్తున్నాడు. ఇది ఒక ఛానల్ 4 ఫొటోలోని దృశ్యం. ఇలా యుద్ధ సమయాల్లో నిరాయుధులను, పిల్లలను చంపడం జెనీవా అంతర్జాతీయ ఒడంబడిక ప్రకారం క్షమించరాని నేరం.    ఆ తరువాత బాలచంద్రన్‌కు సైనికులు తినడానికి బిస్కెట్లు ఇచ్చారని, ఆకలి మీద ఉన్న ఆ బాలుడు వాటిని ఆశగా తిన్నాడని, కొద్దిసేపటికి బిస్కెట్లు ఇచ్చిన వారే ఆ బాలుడిని సమీపం నుంచి తూటాల వర్షం కురిపించి హతమార్చారని కథనం. ఈశాన్య శ్రీలంకలోని ముల్లైతీవు సమీపంలో టైగర్ల ప్రధాన కేంద్రంపై దాడి చేసినప్పుడు జరిగిన కాల్పుల్లో ప్రభాకరన్ కుటుంబం ప్రాణాలు కోల్పోయినట్టు సైనికులు ప్రకటించారు, కాని తీరా చూస్తే అక్కడ జరిగింది యుద్ధం కాదని, నరమేధమని చానల్-4 తెలిపింది. బాలచంద్రన్ కిరాతక వధ దృశ్యాలను మంగళవారం తమిళ చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. వీటిని చూసి మానవత వాదులు, ముఖ్యంగా తమిళులు చలించిపోయారు, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షేపై దుమ్మెత్తి పోశారు.  ఎండీఎంకే అధినేత, ఎల్టీటీఈ సానుభూతిపరుడు వైగో తీవ్ర ఉద్వేగానికి గురై వేలాది చిన్నారుల చేతులు కట్టేసి, కళ్లకు గంత లు కట్టి, ఆహారం తింటుండగానే రాక్షసంగా హతమార్చారని పేర్కొన్నారు. మరో వైపు డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, డీపీఐ కూడా శ్రీలంక సైన్యం అకృత్యాలను తీవ్రంగా ఖండించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: