రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలను అధిగమించేందుకు అవసరమైన అదనపు గ్యాస్ ను కేటాయించలేమని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తేల్చి చెప్పారు. గ్యాస్‌ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, అందుచేత ప్రత్యే కంగా ఆంధ్రప్రదేశ్‌కు గ్యాస్‌ ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి వారు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని రాష్ట్రానికి ఉచిత సలహానిచ్చారు. గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, గుజరాత్‌ ఒప్పుకుంటేనే ఎపికి అదనపు గ్యాస్‌ను ఇవ్వగలమని జ్యోతిరాదిత్య తెలిపారు. దీంతో ఈవేసవిలో రాష్ట్ర ప్రజలకు ఉక్కపోత కష్టాలు తప్పవు. అసలే కరెంటు కోతలతో సతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయం మరింత ఇబ్బందికర పరిణామమే. వేసవి రాకముందే కోతలతో చెమటలు పట్టిస్తున్న ట్రాన్స్ కో రానున్న రోజుల్లో కోతలను మరింత పెంచబోతోంది. కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్ పక్క రాష్ట్రాలకు తరలిపోతుండటంతో దాన్ని ఎలాగైనా ఆపాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యమంత్రి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్యాస్ విషయంలో కేంద్రానికి మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. గ్యాస్ విషయంలో ఎపీ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కేంద్రం ఉచిత సలహా ఇచ్చింది. గుజరాత్ తో మన రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం విషయంలో జోక్యం చేసుకోబోమని జ్యోతిరాదిత్య తేల్చి చెప్పారు. మరి విద్యుత్ సమస్య పరిష్కారానికి కిరణ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: