ఉగ్రవాదులు, విధ్వంసకారులు ఎంత పక్కాగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతారో హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ ప్రాంతంలో జరిగిన జంట పేలుళ్ల ఘటన మరోసారి నిరూపించింది. పేలుళ్ల ఘటనలో కీలక సాక్ష్యాలు అవుతాయని భావించిన సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా దొరకలేదు. దీంతో బాంబు పేలుళ్లు జరిగితే తప్ప మన పోలీసులు, ఇంటలిజెన్స్ సిబ్బంది స్పందించరు అన్న ప్రచారం మరోసారి నిజమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే నగరంలోని ప్రధాన ట్రాఫిక్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే దిల్ షుక్ నగర్ దగ్గర జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మాత్రం సీసీ కెమెరాలు పనిచేయలేదని తెలుస్తోంది. కేవలం సాయిబాబా ఆలయం దగ్గర, చౌరస్తాలో మాత్రమే సీసీ కెమెరాలు పనిచేశాయి. ఆ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో గత నాలుగు రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధ్వంసానికి పాల్పడిన వారే ముందు జాగ్రత్తగా సినీఫక్కీలో సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారని తెలుస్తోంది. లేదంటే ఆప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకున్న తర్వాతే బాంబులు అమర్చి ఉంటారని అనుమానిస్తున్నారు. నిజానికి సాయిబాబా ఆలయం దగ్గరే మరోసారి బాంబులు అమర్చేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తుండడంతో వెనక్కి తగ్గారు.  నాలుగు రోజులుగా సీసీ కెమెరాలు పనిచేయకపోయినా ట్రాఫిక్ సిబ్బంది ఎందుకు చర్యలు తీసుకోలేదు. 24గంటలు పర్యవేక్షిస్తూ ఉంటామని చెప్పే ట్రాఫిక్ పోలీసులు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఎందుకు పట్టించుకోలేదు. అఫ్జల్ గురు ఉరిశిక్ష నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులు జరగవచ్చని సమాచారం ఉన్నా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? మరో రెండు చోట్ల పెట్టిన బాంబులు కూడా పేలి ఉంటే ప్రాణ నష్టం ఇంకెంత ఉండేదో. ఇప్పటికైనా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: