హైదరాబాద్ లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో దిల్ షుఖ్ నగర్ ఒకటి. ఇక్కడ స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, బట్టల షాపులు, వ్యాపార సముదాయాలు ఇలా ఒకటేమిటి అన్నింటికీ దిల్ షుఖ్ నగర్ ఫేమస్. అలాంటిది 21వ తేది సాయంత్రం సరిగ్గా 5 గంటల 58 నిమిషాలకు తొలి బాంబు, 6 గంటల 01 నిమిషానికి రెండో బాంబు పేలుడు శబ్దాలతో రద్దీగా ఉంటే ఆనంద్ టిఫన్ సెంటర్ , కోణార్క్, వెంకటాద్రి థియేటర్లు ఒక్కసారిగా రక్తమోడాయి. బాంబుల మోతతో హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ ప్రాంతం దద్ధరిల్లింది. సుమారు 17మంది వరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. గోకుల్ చాట్, లుంబినీ పార్కులతో పాటు మరో ముష్కర బాణం హైదరాబాద్ గుండెల్లో మాయని మచ్చ అయింది. సంఘటనా ప్రాతంలో కుప్పలుగా పడిన శరీరాలు.. ఆ శరీరాలను గుర్తు పట్టడానికి వీలులేకుండా ఆనవాళ్లను కప్పేస్తూ ఏర్పడిన గాయాలను చూసిన వారెవరైనా కన్నీరు రాల్చాల్సిందే... అయ్యో అనవలసిందే. ఇక చనిపోయిన వారి బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. మీకు మేము ఏం ద్రోహం చేశాము. అసలు మీరెందుకు ఇలాంటి దారుణానికి ఒడిగడుతున్నారంటూ శాపనార్థాలు పెడుతున్నారు. పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగ్గి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన ఎంతో మందిని ఇలా పొట్టన పెట్టుకుంటారా? అంటూ చనిపోయిన వారి ఆత్మ ఘోషిస్తోంది. హైదరాబాద్ అన్ని మతాలకు, అన్ని భాషలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని సంస్కృతులకు నిలయమన్న పేరు ఉంది. దాన్ని చెడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారా ?హైదరాబాద్ ప్రతిష్టను మంటగలుపుతారా? అన్న ఆగ్రహం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: