అంతరిక్ష పరిశోధనల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న శ్రీహరికోట షార్ కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ ద్వారా ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టిన షార్ కేంద్రం పీఎస్ ఎల్వీ సీ-20 ప్రయోగంతో మరో విజయాన్ని అందించేందుకు శాస్త్రవేత్తలు సమాయత్తమయ్యారు. భారత అంతరిక్ష పరిశోథన సంస్థ, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ శాస్ర్తవేత్తల సంయుక్త ఆధ్వర్యంలో తయారు చేసిన పీఎస్ ఎల్వీ సీ-20 కౌంట్ డౌన్ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు పీఎస్ ఎల్వీ సీ-20 అంతరిక్షంలోకి దూసుకుపోనుంది. 44.4 మీటర్ల ఎత్తుతో 229.7 టన్నుల బరువున్న పీఎస్ ఎల్వీ సీ-20 ద్వారా 409 కేజీల సరళ్ ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. పీఎస్ ఎల్వీ సీ-20 కౌంట్ డౌన్ సజావుగా సాగుతోందని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. పీఎస్ ఎల్వీ సీ-20 ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనది. వెయ్యి మందికి పైగా ఇస్త్రో ఉద్యోగులు, శాస్త్రవేత్తలు పీఎస్ ఎల్వీ సీ-20 ప్రయోగంలో పాలుపంచుకోనున్నారు. పీఎస్ ఎల్వీ సీ-20 సీ-20 ప్రయోగాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వీక్షించనున్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా ఇస్రో 22 సార్లు పీఎస్ ఎల్ వీ ప్రయోగాలు చేపట్టగా ఒక్కటి తప్ప అన్నీ విజయవంతమయ్యాయి. ఈ ప్రయోగం కూడా విజయవంతమవుతుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: