దేశ ప్రజల రోజు వారి జీవనంలో భాగమైన రైల్వేల్లో హైటెక్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్‌ యుగంలో రైల్వే సేవలను అందుకు అనుగుణంగా ఆధునీకరించబోతున్నారు. ఇకపై మొబైల్‌ ఫోన్‌తో రైలు టిక్కెట్లను బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. ఈ హైటెక్‌ సేవలను మంగళవారం కేంద్ర రైల్వేమంత్రి బన్సల్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఇక ప్రయాణికులు టిక్కెట్లకోసం రైల్వే కౌంటర్లలో క్యూలు కట్టవలసిన అవసరం లేదు. మొబైల్‌ ఫోన్‌తో టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోవడంతో పాటు వివిధ రైళ్ల రిజర్వేషన్‌ బుకింగ్‌ స్థితిని ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌ ద్వారా పంపే ప్రాజెక్టు ఈ ఏడాది చివరినాటికల్లా పూర్తికావచ్చని మంత్రి తన ప్రసంగంలో వివరించారు. ప్రస్తుతం ఐఆర్‌సిటిసి ద్వారా నిమిషానికి 2వేల మందే టిక్కెట్లు బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టు కార్యాచరణలోకి రాగానే నిమిషానికి 7,200 టిక్కెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 40వేల మంది ఒకేసారి టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకునే వారు ఇకపై లక్షా 20వేల మంది ఒకేసారి టిక్కెట్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. టిక్కెట్‌ బుకింగ్‌లో దళారులను నిరోధించే సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. దీనికి కూడా ఆధార్‌ నెంబర్‌ను అనుసంధానం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఇంటర్నెట్‌ టిక్కెట్‌ బుకింగ్‌ నిర్ధేశిత వేళల్లోనే అనుమతిస్తున్నారు. కానీ ఇకపై అర్ధరాత్రి 11.30 నుంచి 12.30 వరకు ఒక గంటమాత్రమే టిక్కెట్‌ బుకింగ్‌ సౌకర్యం ఉండదు. మిగిలిన 23 గంటలు ఇంటర్నెట్‌తో టిక్కెట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో నెట్‌కోసం ఫ్రీ వైఫైను ప్రవేశపెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: