ఇంకా పూర్తిస్థాయిలో వేసవి ప్రారంభం కాలేదు. అప్పుడే గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నీటికష్టాలు మొదలయ్యాయి. రోజురోజుకు తాగునీటి సమస్య తీవ్రతరం అవుతోంది. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. శివారు కాలనీలు, బస్తీల్లో నీటి కష్టాలతో జనం తల్లడిల్లుతున్నారు. రోజు విడిచి రోజు సరఫరా అయ్యే నీరు కొన్ని ప్రాంతాల్లో నాలుగురోజులకు ఒకసారి వస్తోంది. దీంతో మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు నగరవాసులు. పన్నుల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులు సౌకర్యాల విషయంలోకి వచ్చేసరికి పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కాలనీవాసులకు అందించాల్సిన నీటిని డబ్బులు ఇచ్చిన వారికి ట్యాంకర్లలో సరఫరా చేస్తూ జీహెచ్ ఎంసీ నీటి వ్యాపారం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో తెలియని బల్దియా వాటర్ ట్యాంకర్ కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్ రాగానే నీటి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే దీనికి అధికారుల్లో కొరవడిన ముందు చూపు, విధి నిర్వహణలో అలసత్వం కారణమంటున్నారు. మరోవైపు నగరానికి తాగునీటిని అందించే అయిదు ప్రధాన జలాశయాల్లో ఇప్పటికే నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు దాదాపు అడుగంటాయి. కేవలం శివారు ప్రాంతాలే కాకుండా నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన కాలనీలకు కూడా సరిగ్గా నీళ్లు రావడం లేదు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు మేల్కొని..కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీటిని సరఫరా చేయాలని భాగ్యనగర వాసులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: