2014 లో అధికార పీఠం ఎక్కేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని కసరత్తులు చేస్తోంది తెలుగు దేశం పార్టీ. ఓ వైపు తాము కష్టపడుతూనే మరోవైపు పాత మిత్రులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయానికి ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగటం టీడీపీకి ఆనవాయితీగా వస్తోంది. పార్టీ పుట్టిన 30 ఏళ్ల నుంచి ఇది కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ తో పాటు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న ఎంఐఎంతో పొత్తుకి ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలో జరగనున్న స్థానిక మండలి ఎన్నికల్లో ఎంఐఎకుం మద్దతిస్తామని ఓపెన్ అఫర్ ఇచ్చింది. అసెంబ్లీలో జరిగిన లాబీపై నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. ఎంఐఎం నేతలే తమను మద్దతివ్వమని కోరారని టీడిపి నేతలు చెబుతుండగా..ఎంఐఎం వారు మాత్రం టిడిపి నేతలే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయంలో మద్దతిస్తామని ముందుకొచ్చారని అంటున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం బంధం తెగిపోవటంతో టీడీపీ దానిని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చూస్తోంది. అయితే ఎంఐఎం ఏ విషయం తేల్చకుండా టీడీపీతో దోబూచులాడుతోంది. టార్గెట్ 2014 గా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు... బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీలతో పొత్తుల ద్వారా అధికారం పీఠం ఎక్కాలని భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఎంఐఎంతో పొత్తు టార్గెట్ మిస్సవ్వకూడదని టీడీపీ భావిస్తోంది. 2009 లో పొత్తులు కలిసిరాకపోయినప్పటికీ.. ఈ సారి ముందస్తుగా పొత్తులు ఖరారు చేసుకోవాలన్నది టీడీపీ వ్యూహ్యం. అందులో భాగంగానే పాత మిత్రులతో కొత్త దోస్తీ షూరూ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: