58ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మరో అరుదైన సంఘటన జరగబోతోంది. దేశంలో రెండో మహిళను ఉరి తీసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. సోనియా అనే మహిళకు ఉరిశిక్ష అమలు చేయడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనుమతి ఇచ్చారు. ఆమె పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను ప్రణబ్ తిరస్కరించారు.  హర్యానా మాజీ ఎమ్మెల్యే రేలురాం పునియా కుమార్తె సోనియా. హిస్సార్ లోని ప్రభువాలాలో ఉంటున్న సోనియా కుటుంబంలో ఆస్తి తగాదాలు వచ్చాయి. దీంతో సోనియా 2001 ఆగస్టు 23న భర్త సంజీవ్ తో కలిసి 8 మంది కుటుంబ సభ్యులను హత్య చేశారు. తండ్రి రేలురాం పునియా, తల్లి కృష్ణ, సోదరి ప్రియాంక, వరుసకు సోదరుడైన సునీల్, ఆయన భార్య శకుంతలతో పాటు సునీల్ పిల్లలు లోకేష్, శివాని, ప్రీతిని హత్య చేశారు. ఈ కేసులో స్థానిక సెషన్స్ కోర్టు 2004 మే 31న సోనియా, సంజీవ్ కు ఉరిశిక్ష విధించింది. నిందితులు హైకోర్టును ఆశ్రయించడంతో 2005లో ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అయితే, 2007లో సెషన్స్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సోనియా, సంజీవ్ లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఆ తర్వాత వారు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టాలంటూ దరఖాస్తు చేకున్నారు. సోనియా ఉరిశిక్షను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. అయితే సోనియా, సంజీవ్ లకు ఉరి శిక్ష ఎప్పుడు అమలు చేస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. దేశంలోనే తొలిసారిగా 1955 జనవరి 3న రతన్ బాయి జైన్ అనే మహిళను ఉరి తీశారు. ముగ్గురు బాలికలకు విషం పెట్టి హత్య చేసిన కేసులో రతన్ బాయికి ఉరిశిక్ష అమలు చేశారు. ఆ తర్వాత పలువురు మహిళలకు ఉరిశిక్ష పడినా... చివరకు క్షమాభిక్ష లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: