సీబీఐ అయిదో చార్జిషీట్‌లో హోంమంత్రి సబితను నాలుగో నిందితురాలుగా చేర్చడంపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆరా తీస్తోంది. సబిత కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్ర నేతల నుంచి వివరాలు సేకరించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ గులాం నబీ ఆజాద్‌.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్‌ చేశారు. సీబీఐ ఛార్జిషీట్‌పై ఆరా తీశారు.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రికి ఆజాద్‌ సూచించారు. ఇక వైద్యం కోసం అమెరికా వెళ్లిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కూడా భారత్‌ తిరిగొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలపై సోనియా ఆరా తీసినట్టు సమాచారం. సీబీఐ చార్జిషీట్‌పై కూడా సోనియా వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం.  మరోవైపు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ టూర్‌లో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అధిష్టానం పెద్దలతో పీసీసీ చీఫ్‌ చర్చించనున్నారు. సబిత వ్యవహారం కూడా చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు సబిత శాఖ మార్పుపై కూడా ఊహాగానాలు జోరందుకున్నాయి. హోం శాఖ నుంచి మరో శాఖకు సబితను మార్చొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద కాంగ్రెస్ లో చార్జ్ షీటు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: