ధగధగలాడే బంగారం ధనాధన్ దిగివచ్చి అలసిపోయింది. తాజాగా మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,910 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 25,590గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 45,950 వద్ద ట్రేడవుతోంది. గత వారం రోజుల్లో పసిడి ధర భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ముంబై ప్రధాన బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 25,820 స్థాయికి దిగజారింది. ఆతర్వాత కాస్త కోలుకొని గత శనివారం రూ. 26,395కు చేరింది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఇటీవల ధరలు కుప్పకూలడంతో ఇప్పుడు అందరికళ్లూ స్వర్ణంపైనే ఉన్నాయి. అయితే, పసిడి ధరలు కొన్నాళ్లు ఇప్పుడున్న స్థాయిలోనే స్థిరంగా కొనసాగవచ్చని నిపుణులు విశ్లేసిస్తున్నారు. స్వల్పకాలానికి 10 గ్రాముల పుత్తడి ధర రూ.25,500-26,500 శ్రేణిలో కదలాడవచ్చనేది వారి విశ్లేషణ. బంగారం రేటు మరింత తగ్గుదల లేదంటే పెరిగేందుకు అంతర్జాతీయంగా బలమైన పరిణామాలు(ట్రిగ్గర్) చోటుచేసుకోవాల్సి ఉంటుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటిదాక అంతే.. గత వారంలో పసిడి రేటు పతనంతో ఇప్పటికే భారీగా ధర దిగొచ్చింది. స్వల్పకాలానికి తక్కువ శ్రేణి(రేంజ్ బౌండ్)లోనే కదలాడొచ్చు. పుత్తడి మరింత పడిపోవడం లేదా పెరగడం ఈ రెండింట్లో ఏ దిశలో వెళ్లాలన్నా ఒక ట్రిగ్గర్ అవసరం. కొంత వేచిచూసే ధోరణి ఉంటుంది. మొత్తం కమోడిటీస్ విభాగంపై మార్కెట్ బేరిష్‌గా ఉంది. పైస్థాయిలకు తిరిగి ధరలు పుంజుకునే విధంగా పెద్దగా ఛాన్స్ లేదు. దేశీయ మార్కెట్లో ధర 10 గ్రాములకు రూ.25,500-26,500 స్థాయిలో కదలాడొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 1,340-1,410 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చు. ఏదైనా ఒక దిశ మళ్లీ తీసుకునేవరకూ ఇదే పరిస్థితి నెలకొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా వివిధ ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలరు విలువ ఇంకా పటిష్టం అయితేతప్ప.. బంగారం ఇప్పుడున్న స్థాయిలోనే కొన్నాళ్లు కొనసాగవచ్చని అంటున్నారు. అదేవిధంగా బంగారం మళ్లీ బలపడాలంటే ఏదైనా అంతర్జాతీయ సంఘటనలు చోటుచేసుకోవాల్సి ఉంటుందన్నారు. సైప్రస్, ఇంకా మరికొన్ని దేశాలు బంగారాన్ని అమ్మే ప్రణాళికల్లో ఉన్నాయన్న వార్తలతో మార్కెట్ మరీ అతిగా స్పందించిందని, తాజా పతనం దాదాపు అట్టడుగుకు(బాటమ్) చేరుకున్నట్లేనని అభిప్రాయపడుతున్నారు. ‘రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ.25,500 కనిష్టానికి మళ్లీ దిగిరావచ్చు. అయితే, తిరిగి కోలుకొని రూ.28,000 గరిష్టస్థాయికి కూడా ఎగబాకే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: