రాష్ట్రంలో జనాకర్షణ ఉన్న ఇద్దరు అగ్ర నేతలు ఇప్పుడు సీబీఐని చూసి భయపడుతున్నారు. వారి అక్రమ ఆస్తులు, వ్యాపారాల్లో పెట్టుబడుల మూలాలపై విచారణ జరపాలంటూ ప్రత్యర్ధులు సీబీఐ గుమ్మం ఎక్కుతున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు అందిస్తున్నారు. ఇందుకోసం మద్దతుగా సమాచార హక్కు చట్టాన్ని కూడా కవచంలా వాడు కుంటున్నారు. దీంతో వారిద్దరి అనుచరులు, శ్రేణుల్లో టెన్షన్‌ మొదలయింది. తాజాగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేంద్రమంత్రి చిరంజీవికి సంబంధించిన రెండు వేర్వేరు అంశాలపై విచారణ జరపాలంటూ వారి ప్రత్యర్ధులు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఇప్పటివరకూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆయన కుటుంబం సీమాంధ్ర వ్యాపారస్తులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలుండేవి. అందులో భాగంగా కొడుకు కేటీఆర్‌, కూతురు కవిత, మేనల్లుడు హరీష్‌కు ఒక్కో విభాగం అప్పగించారన్న విమర్శలు బహిరంగంగానే వినిపించేవి. కానీప్పుడు కేసీఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, 2001 నుంచీ టీఆర్‌ఎస్‌పై ఈగవాలినా సహించకుండా టీవీ చర్చల్లో ప్రత్యర్థి పార్టీలు, మీడియాను దుయ్యబడుతూ వచ్చిన ఆయన వెలమ సామాజికవర్గానికే చెందిన న్యాయవాది రఘునందన్‌రావు హఠాత్తుగా తెరపైకి రావడం సంచలనం సృష్టించింది.

కేసీఆర్ కేసు..
కేసీఆర్‌ అక్రమ సంపాదన, పెట్టుబడులపై దర్యాప్తు జరపాలంటూ రఘునందన్‌ నేరుగా సీబీఐ జాయింట్‌ డైరక్టర్‌ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు. ‘టీ న్యూస్‌ చానెల్‌, నమస్తే తెలంగాణ దినపత్రికలో కేసీఆర్‌ పెట్టుబడులపై విచారణ జరపాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించాలి. ప్రస్తుతం జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, రంగారావు నుంచి వాటి పెట్టుబడుల కింద డబ్బులు తీసుకున్నారు. దీనిపై విచారణ జరపాల’ని తన వద్ద ఆధారాలను సీబీఐకి అందచేశారు. జైల్లో ఉన్న నిందితుడు నిమ్మగడ్డను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని చెప్పారు. ఈ రెండు మీడియా సంస్థల పెట్టుబడులకు సంబంధించి త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌కూ ఫిర్యాదు చేసేందుకు రఘునందన్‌రావు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ పరిణామాలు సహజంగానే సంచలనం సృష్టించాయి. తెలంగాణలో హీరోగా ముద్ర ఉన్న కేసీఆర్‌పై ఇంతవరకూ ఈ స్థాయిలో ఎదురుదాడి చేసి, యుద్ధం ప్రకటించిన వారెవరూ లేకపోవడమూ ఆ సంచలనానికి మరో కారణం. కొద్దికాలం క్రితం వరకూ కేసీఆర్‌ వెన్నంటే ఉంటూ, మెదక్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వరసగా పనిచేసిన రఘు హఠత్తుగా చానెల్‌, తెలంగాణ దినపత్రిక పెట్టుబడులపై విచారణ కోసం సీబీఐ గడప తొక్కారంటే.. కచ్చితంగా అందులో వాస్తవం లేకపోలేదన్న భావన రోజురోజుకూ బలపడుతోంది. దానితో కేసీఆర్‌ పెట్టుబడులపై సీబీఐ విచారణ ఉంటుందా? లేదా? అన్న టెన్షన్‌ మొదలయింది. ఒకవేళ సీబీఐ స్పందించి జైల్లో ఉన్న నిమ్మగడ్డతోపాటు, రంగారావునూ విచారిస్తే పరిస్థితి ఏమిటన్న అన్న మరో టెన్షన్‌ పార్టీ శ్రేణుల్లో మొదలయింది. స్వతహాగా న్యాయవాది కూడా అయిన రఘునందన్‌ పట్టుదల చూస్తే.. ఆయన ఢిల్లీలో సీబీఐ, ఈడీతో విచారణ జరిపించేదాకా విశ్రమించేలా కనిపించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

advertisements


చిరుపై కూడా..
అటు కేంద్రమంత్రి చిరంజీవి కూడా సీబీఐ విచారణ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పర్యాటక సదస్సు ఏర్పాట్లకు సంబంధించి చేసిన ఖర్చు 2 కోట్ల రూపాయలు దాటిందన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ ఉస్మానియా జేఏసీకి చెందిన విద్యార్ధి నేతలు జేడీ లక్ష్మీనారాయణను కలసి వినతిపత్రం సమర్పించారు. పార్క్‌హయత్‌, తాజ్‌ఫలక్‌నుమాల్లో కేవలం మూడురోజుల సదస్సుకు సంబంధించి చేసిన ఏర్పాట్ల కోసం 2 కోట్ల 14 లక్షలు ఖర్చు పెట్టారని, దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారాన్ని జేడీ లక్ష్మీనారాయణకు ఇచ్చారు. చిరంజీవి కేంద్రమంత్రి అయిన తర్వాత వెలుగుచూసిన తొలి ఆర్ధికపరమైన ఆరోపణ కావడంతో చిరంజీవి మద్దతుదారుల్లోనూ టెన్షన్‌ మొదలయింది.

ఇప్పటికే జగన్‌ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ చేస్తున్న విచారణ ఫలితంగా ఎంపీ జగన్మోహన్‌రెడ్డి, మంత్రి మోపి దేవితోపాటు ఐఏఎస్‌ అధికారులు కూడా జైలు పాలయిన వైనంతో అందరికీ సీబీఐ-ఈడీ అంటేనే హడల్ పుడుతోంది. ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కేసీఆర్, చిరంజీవిల సంగతి ఏమౌతుందోనని హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: