ప్రతి మనిషి 16 సంవత్సరాల దగ్గర నుండి ఎదో ఒక రంగంలో కష్టపడి పనిచేసి తన కుటుంబ అభివృద్ధికి పాడుపడతారు. యుక్త వయస్సులో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే సమర్థత ఉంటుంది. ధైర్యంగా బ్రతకగల్గుతారు. కాని 60 సంవత్సరాల పై బడిన వారిలో నిత్యం కష్టపడి పని చేయాలంటే శక్తి ఉండదు. అందులోనూ ఆనారోగ్య కారణాల వలన పని చేయలేరు.  వ్యవసాయ రంగంలో కూలీ, నాలీ చేసుకొనేవారికి, కౌలుకి వ్యవసాయము చేసేవారికి రెక్కల కష్టం తప్ప వారికి స్థిర ఆస్తులనేవి ఉండవు. పని చేసినంత కాలమే వారి కుటుంబానికి, వారికి ఉపాధి. పిల్లలకు వాళ్ల కుటుంబాలను పోషించుకొవడమే కష్టంగా ఉంటుంది. వయో వృద్ధులను పోషించలేక వాళ్ళ బాధకు వాళ్ళనే వదిలి వేస్తున్నారు. పని చేసినా చేయిక పోయినా వయో వృద్ధులకు కనీసం తిండి, బట్ట, గూడ, అనారోగ్యానికి చికిత్స, మందులు చనిపొయేంత వరకూ అవసరం. ఈ బాధ్యత ఎవరిది..? ప్రభుత్వానికి బాధ్యత లేదా..? మన దేశంలో అసంఘటిత కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. స్థిరాస్తి లేక రెక్కల కష్టం మీద వాళ్ల కుటుంబానికి కావలిసినది సంపాదించి పెట్టి వారి అభివృద్ధికి కృషి చేశారు. వృద్దాప్యంలో ఏమీ చేయలేక అధ్వాన స్థితిలో జీవిస్తున్నారు. తిండి, బట్ట, గూడు లేక నికృష్ట జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యోగులకు అన్ని రాయితీలు చనిపొయేదాక ఉన్నాయి. సంఘిటిత కార్మికులకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. వారికి ఇన్ని బాధలు లేవు. ఏ ఆధారము లేని వయో వృద్ధులకు నెలకు 1500 రూపాయిల భృతి, మెరుగైన వైద్య సేవలు, ఉచిత మందులు, బస్, రైలు ఛార్జీలలో 80 శాతం రాయితీ, సబ్సీడి పై నిత్యావసర సరుకులు వయో వృద్ధుల కార్డు ద్వారా అందించాలి. ఈ అవకాశాలను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. లేకపొతే వారి జీవితాలు నికృష్టంగా తయారు అవుతాయి. వాళ్లూ కుటుంబానికి దేశానికి సేవలు అందించిన వారే. దేశ అభివృద్ధికి తోడ్పడిన వారే. అలాంటి వారిని మర్చిపొతే మానవత్వం అనిపించదు. దేశ ఉత్పాదక శక్తిలో ఆ శ్రమ జీవుల భాగసామ్యం ఎంతో ఉన్నది. కాబట్టి వారిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ర్టాలపై ఉన్నదన్నది ప్రజల అభిప్రాయం. దేశంలో అవినీతితో సంపాదించిన సంపదను వెలికితీసి, లక్షల కోట్లలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి వయో వృద్ధుల సంక్షేమానికి ఖర్చు బెట్టి, పెద్దల ఋణం తీర్చుకోవాలి, దాన్నే మంచి పాలన అంటారు. ఈ విధంగా వయోవృద్ధులను ఆదుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. వయో వృద్దులకు మెరుగైన జీవితాన్ని అందించాలని లక్షలాది మంది కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏదో కొన్ని కంటి తుడుపు చర్యలు మొదలు పెట్టారు. అది వారి జీవితాలకు ఏ మాత్రం చాలక ఆకలి, అనారోగ్యంతో అలమటిస్తున్నారు. వయో వృద్ధులకు భద్రత కల్పించాల్సిన బాధత్య ప్రభుత్వం మీద ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: