ఇన్నాళ్లూ అచేతనావస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమంలో కదలిక కనిపిస్తోంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆజ్యం పోస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ యువతకు బూస్ట్ అందిస్తున్నారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో.. కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు త్వరలో ఓ ఆల్బమ్ ను విడుదల చేయబోతున్నారు.

తిడితె భరించాం..
విడగొట్టి గెంటేస్తే సహించాం..
ఇచ్చిన మాట నిలబెట్టు కోక పోతే,
తిరగబడతాం!! 

గాంధిజీని ప్రేమిస్తాం.. 
అంబేద్కర్ ని ఆరాధిస్తాం..
సర్దార్ పటేల్ కి సెల్యూట్ చేస్తాం..
భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం
కానీ...
తల ఎగరేసే ఉత్తరాది నాయకత్వం..
దక్షిణాది ఆత్మగౌరవాన్నికించపరుస్తు పోతె..
చూస్తూకూర్చోం
మెడలు వంచి, కింద కూర్చోపెడతాం.

ఇవి ఆంధ్రప్రదేశ్ యువతకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇస్తున్న పిలుపు. రాష్ట్రానికి అన్యాయం చేసి.. వినోదం చూస్తున్న కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధం కావాలంటూ ట్వీట్ల ద్వారా పౌరుషాన్ని నూరిపోస్తున్నారు. ఇన్నాళ్లూ తిడితే భరించాం.. విడగొట్టి గెంటేస్తే సహించాం కానీ.. ఎన్నికల వేళ ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోక తిరుగుబాటు తప్పదని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. గాంధీని ప్రేమిస్తాం.. అంబేద్కర్ ను ఆరాధిస్తాం... సర్దార్ పటేల్ కు సెల్యూట్ చేస్తాం.. అలా అని ఉత్తరాది నాయకత్వాన్ని సహించేది లేదని పవన్ తెగేసి చెబుతున్నారు. దక్షిణాది ఆత్మగౌరవాన్ని కించపరుస్తు పోతే  చూస్తుకూర్చోమని, మెడలు వంచి కింద కూర్చోపెడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్ర్రత్యేక హోదా లేదు.. ప్యాకేజీనే అంటూ ఊహాగానాలు వినిపించిన నాటి నుండి.. పవన్ కల్యాణ్ ఆ సమస్యను భుజానికెత్తుకున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ నినదించారు. తిరుపతి, కాకినాడ వేదికల మీదుగా కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5కాదు పదేళ్లు కావాలని పార్లమెంట్ లో వాదించిన వెంకయ్యనాయుడు.. ఆతరువాత ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని పవన్ డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచడానికి మూడు దశల్లో పోరాటం చేస్తానని ప్రకటించారు. కేంద్రం, బీజేపి ఎంపీలపైనా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తానన్నారు. అప్పటికీ స్పందించకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతానన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరిని పవన్ తప్పు పట్టారు. కేంద్రం నిధులిచ్చిందంటూ టీడీపీ నేతలు చెప్పిన లెక్కలను కాకిలెక్కలుగా అభివర్ణించిన ఆయన.. గందరగోళ లెక్కలు తమకొద్దని, కావాల్సిందల్లా ప్రత్యేక హోదా మాత్రమేనన్నారు. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కష్టపడుతున్నప్పటికీ.. ప్ర్రత్యేక హోదా కోసం ఎందుకు ముందుకు వెళ్లడం లేదని పవన్ నిలదీశారు. 


ప్రత్యేక హోదా కోసం ఉద్యమం తప్పదని ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా సాధనకు సిద్ధమవుతున్నారు. త్వరలో ఓ ఆల్బమ్ ను విడుదల చేయబోతున్నట్లు తన ట్విట్టర్లో ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 5న ఆల్బమ్ విడుదల చేయాలని భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనవరి 24నే విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నాడు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆల్బమ్ ద్వారా జనసేన గళాన్ని వినిపించిననున్నట్లు పవన్ ట్వీట్ చేశారు. ప్రజలంతా శాంతియుత ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 26న విశాఖ ఆర్కేబీచ్ లో జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతీ ఆంధ్రుడు ఓ సైనికుడై కదలాలన్నారు పవన్ కల్యాణ్. తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమానికి రాజకీయ నేతలు సంఘీభావం అవసరమన్న ఆయన.. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్ధత తక్కువగా ఉన్న మన నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంత వరకు స్పూర్తి పొందుతారనే సందేహాన్ని వెలిబుచ్చారు. అయితే ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా.. ప్రజలు మాత్రం రాజీపడబోరన్న గట్టి నమ్మకం తనకుందన్నారు పవన్ కల్యాణ్. 




మరింత సమాచారం తెలుసుకోండి: