తప్పు చేస్తేనే శిక్ష కాదు.. ఒక్కోసారి చేయని  తప్పుకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ  అక్కడో ప్రాణం 118 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తోంది. సంకెళ్లతో నాకెప్పుడు విముక్తి అంటోంది. అందరూ వింతగా చూస్తున్నారు, కానీ ఎవరూ శిక్ష నుంచి తప్పించడం లేదు… ఇంతకీ ఎవరా బందీ… ఏమా కథ…?


ఈ మర్రిచెట్టే మనం చెప్పుకున్న ఖైదీ… ఆశ్చర్యంగా ఉందా.. చెట్టుకు శిక్ష ఏంటి అంటారా… నిజంగానే ఇది నిజం… ఈ చెట్టు జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ…. పాకిస్థాన్ లాండీకోటల్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఉందీ చెట్టు… 1898లో ఈ చెట్టుకు శిక్ష విధించారు. అప్పట్నుంచి సంకెళ్లతో దీన్ని బంధించారు. చుట్టూ కంచె వేశారు… ఎవరూ లోపలకు రారు….రానివ్వరు. ఇంతకీ ఈ చెట్టు ఏం తప్పు చేసింది అనుకుంటున్నారా..?

అప్పట్లో జేమ్స్ క్విడ్ అనే బ్రిటీష్ అధికారి ఆ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నాడు. ఓ రోజు తప్పతాగిన ఆ సార్… చెట్టు పక్కనుంచి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒక్కసారిగా తూలి ఆ చెట్టుపై పడ్డాడు. అంతే అతనికి ఆ చెట్టుపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ చెట్టు ఉద్దేశపూర్వకంగానే తనను చంపడానికి ప్రయత్నించిందని వాదించాడు. తాను పడిపోవడానికి ఆ చెట్టే కారణమని అందరిని నమ్మించాడు. వెంటనే సిబ్బందిని పిలిచి ఆ చెట్టును బంధించమని ఆదేశించాడు. సంకెళ్లు వేయించి అరెస్ట్ చేయించాడు.


పెద్ద సార్ తలచుకుంటే ఏమైనా జరిగి తీరుతుంది కదా… అంతేకాదు నేను ఖైదీని… పారిపోకుండా నన్ను ఇలా బంధించారు అంటూ ఓ బోర్డు కూడా ఆ చెట్టుకు పెట్టించాడు. అదండీ కథ తాను చేయని తప్పుకు ఈ వృక్షరాజం అప్పట్నుంచి దోషిలా తలవంచుకుని నించుంది. 118 ఏళ్లు గడిచినా ఇప్పటిదాకా ఆ చెట్టుకు విముక్తి కలిగించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆ చెట్టు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది.  తనకు ఈ శిక్ష నుంచి విముక్తి ఎవరు కలిగిస్తారో అని ఎదురు చూస్తోంది ఆ మర్రిచెట్టు…


మరింత సమాచారం తెలుసుకోండి: