వాస్త‌వానికి జనవరి 26న వైజాగ్ లో ఏదో జరిగిపోతుందనుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ  ఆసక్తిగా గమనించారు. వైజాగ్ ఆర్కే బీచ్ లో  మౌన ప్రదర్శన చేయడానికి యువత, ప్రజలు బాగానే తరలివచ్చారు. అయితే ఈ మౌన ప్రదర్శనకు అనుమతి ఇవ్వని పోలీసులు వైజాగ్ వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని ఆర్కే బీచ్ చేరుకోకుండా అడ్డుకున్నారు. దీంతో ఉవ్వెత్తున లేస్తుందనుకున్న ఉద్యమం చల్లారిపోయింది. ఈ ఉద్య మానికి మొదటి నుండి ఎంతో సపోర్ట్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌన ప్రదర్శనను ముందుండి నడిపిస్తారని అందరూ ఆశించారు. 


కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం తన ట్వీట్లతోనే సరిపెట్టేసాడు తప్ప ప్రత్యక్షంగా హాజరు కాలేదు. కానీ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై విరుచుకుప‌డే ప్ర‌య‌త్నం మాత్రం చేశారు. గతంలో చంద్రబాబునాయుడు 'నోట్ ఫర్ ఓట్' కుంభకోణంలో చిక్కుకున్న వేళ, తననుంచి ఒక్క మాట కూడా రాలేదన్న విమర్శలకు పవన్ సమాధానం ఇచ్చారు. ఆనాడు తాను మాట్లాడకపోవడానికి కారణాన్ని వివరిస్తూ, "అది ఒక్క తెలుగుదేశం పార్టీ చేసుండుంటే, అంతకుముందు అలా ఎవరూ చేయకుండా ఉండుంటే, నేను కచ్చితంగా, బలంగా నిలదీసి వుండేవాడిని. అన్ని పార్టీలూ హార్స్ రైడింగ్ చేస్తాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 

దాన్ని నేను వెనకేసుకు రావడమనుకోండి, ఇంకేమైనా అనుకోండి... నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి దానికీ గొడవలు పెట్టుకుంటే... ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి. ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే, ప్రజలకు నష్టం కలుగు తుందే తప్ప, పనులు ముందుకు సాగవని చూసీ చూడనట్టు మాట్లాడాన‌న్నారు. అది తెలిసో తెలీకో కాదు... తెలిసే" అని పవన్ చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను ఇన్నాళ్లూ ప్రభుత్వాలపై విమర్శలకు దిగలేదని అన్నారు. వాళ్లు చేస్తున్నది తన ఉద్దేశంలో సరైనదేనని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి తాను ఎందుకు మద్దతిచ్చానన్న కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వివరించారు. "అప్పటికి పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి, సమస్యలను తా త్సారం చేసినందుకు... కొత్తగా ఒకరు ప్రధానమంత్రి అవుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి, ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సమస్యలను అర్థం చేసుకుంటారు. అలాగే పది సంవత్సరాలు తెలుగు దేశం పార్టీ అధికారంలో లేదు. జరిగిన అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకోని ఉంటారని అనుకున్నాను. అందుకే మద్దతిచ్చాను. ఆ రోజున నాకు వీలైనంత సాయం చేశాను. 

వారి జెండాను నేను మోశాను. నాతో పాటు నన్ను నమ్మినవారందరూ, నన్ను ఫాలో అయిన వారందరూ మోశారు. కానీ వాళ్లు ఏదైతే మాటిచ్చారో, దాన్ని తప్పారు" అని నిప్పులు చెరిగారు. బీజేపీకి తాను మద్దతిస్తున్న వేళ, తనకు రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్న తలెత్తలేదని, ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ నాథ్ సింగ్ అడగలేదని పవన్ చెప్పారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు తనను తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తిప్పారని, బతిమిలాడి తెలంగాణ అంతటా పర్యటనలకు పంపారని పవన్ గుర్తు చేశారు. ఆనాడు ప్రచారానికి అవసరం లేని రాజకీయ అనుభవం నేడెందుకని పవన్ ప్రశ్నలు సంధించారు.

ఈ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగితే, తనకు రాజకీయాలపై ఏబీసీడీలు తెలియవని, నేర్చుకుని రమ్మంటు న్నారని, ఇంతకు మించిన అవకాశవాదం ఇంకేముంటుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికా రంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్ల కాలంలో తాను ప్రభుత్వాలను ఎన్నడూ ఇబ్బందులు పెట్టలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అన్నీ రూల్ బుక్ ప్రకారం జరగాలంటే కుదరదన్న సంగతి తనకు తెలుసునని, అందుకే తగినంత సమయం ఇవ్వాలని భావించినట్టు తెలిపారు. వాస్త‌వానికి  వైజాగ్ లో తలపెట్టిన మౌన ప్రదర్శనకు పవన్ కళ్యాణ్ హాజరయితే పరిస్థితి మరొకలా ఉండేదని అందరూ అనుకుంటున్నారు. 
డేరింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు. రాజు లేని యుద్ధం ఎప్పుడైనా గెలుస్తుందా…? అని వర్మ ప్రశ్నించాడు. పవన్ రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నాడు.

 "ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల పక్షాన నిలబడటానికి నేను సొంత కుటుంబంతో, సొంత అన్నయ్యతో కూడా విభేదించి వచ్చిన వాడిన‌ని తెలిపిన ప‌వ‌న్, టీడీపీ,బీజేపీల‌తో ఉన్న పరిచయమో, స్నేహమో... కలిసి ప్రయాణించినా దాన్ని విభేదించి బయటకు రావడానికి నాకేమీ ఇబ్బంది లేదు. దాన్ని గురించి ఆలోచించను. మీకూ నాకూ మధ్య ఉన్నది ఓ కామన్ ఎజెండా. ప్రజల కోసం పనిచేయడం. అది జరగనప్పుడు నేను ఎందుకు మీ పక్షం ఉండాలి? ఒక్కసారి నాకు చెప్పాలి. నాక్కాదు... ప్రజలకు చెప్పాలి" అని పవన్ తన మనసులోని భావాన్ని వెల్లడించారు. దీంతో తెలుగుదేశం, బీజేపీతో కటీఫ్ సంకేతాలు పవన్ నుంచి వచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: