తమిళనాట శశికళకు షాకుల మీద షాకులిస్తున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఇప్పటివరకు పది శాతమే బయటపెట్టానని.. 90 శాతం బయటపెడితే అందరి బతుకులు రోడ్డున పడతాయని హెచ్చరించిన పన్నీర్ సెల్వం.. శశికళపై దూకుడుగా దూసుకుపోతున్నారు. మాట్లాడటమే రాదనుకున్న పన్నీరు సెల్వం.. మెల్లిగా తన విశ్వరూపం చూపిస్తున్నారు. సెల్వం వాగ్దాటికి , తెగువకు, ధిక్కార స్వరానికి శశికళ వర్గం బిత్తరపోయింది. 


శశికళను  పోయెస్ గార్డెన్ నుంచి తరిమేస్తానని బహిరంగంగా ప్రకటించిన పన్నీర్ సెల్వం.. శశికళను మరింత చిక్కుల్లో పడేశారు. 2011లో శశికళను ఆమె కుటుంబీకులను జయలలిత ఇంట్లో నుంచి బహిష్కరించిన సమయంలో.. తిరిగి వచ్చేందుకు శశికళ.. అమ్మకు రాసిన లేఖను బయటపెట్టారు. అందులో తనకు ఎలాంటి పార్టీ పదవులు వద్దని.. భవిష్యత్తులో కూడా ఏమీ ఆశించబోనని హామీ ఇస్తూ శశికళ రాసిన లేఖను పన్నీర్ సెల్వం బయటపెట్టారు. అప్పుడు అమ్మ దగ్గర ప్రాథేయపడిన శశికళ.. అమ్మలేని సమయం చూసి రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఆమెను పోయెస్ గార్డెన్ నుంచి తరిమేస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


పన్నీర్ సెల్వం.. శశికళపై ఇంత తీవ్రస్థాయిలో మండిపడడం ఇదే తొలిసారి. అంతేకాదు… తనకున్న అధికారాలను ఉపయోగించి పోయెస్ గార్టెన్ ను జయ మెమోరియల్ గా మారుస్తూ.. ఫైల్ పై సంతకం కూడా చేశారు. ఎవరూ ఊహించని విధంగా వేద నిలయం భవంతిని జయ మెమోరియల్ గా మారుస్తున్నట్టు ప్రకటించారు. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే.. శశికళ.. బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆ భవనంలో జయలలిత వాడిన వస్తువులు ఆమెకు వచ్చిన జ్ఞాపికలు, ఇతర వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు పన్నీర్ సెల్వం వెల్లడించారు.


మరోవైపు, తమిళనాట పన్నీర్ కు భారీ ఎత్తున మద్దతు పెరుగుతోంది. శశికళ సీఎం పీఠంపై కూర్చోవడం తమకు ఇష్టం లేదని... జయ నమ్మినబంటు పన్నీర్ మాత్రమే ఆ స్థానంలో ఉండాలంటూ సోషల్ మీడియాలో లక్షలాది కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నైలోని మెరీనా బీచ్ లో పన్నీర్ కు మద్దతుగా ఆందోళనలు, ఉద్యమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటిలిజెన్సు కు సమాచారమందింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మెరీనా బీచ్ వద్ద భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: