తమిళనాడు అసెంబ్లీలో పళని స్వామి విజయం సాధించాడు అనడం కంటే పన్నీరు ఓడిపోయాడు అనడమే సబబుగా ఉంటుంది. కావాలసినంత సమయం అందుబాటులో ఉన్నా కళ్లు మూసుకుని కాలం గడిపిన పన్నీరు సెల్వం ...బలనిరూపణ సమయం వచ్చే సరికి ప్రత్యర్ధులకు చేజేతులా విజయాన్ని అందించాడు. 


ఈ నెల ఏడవ తేదిన శశికళను దిక్కరించిన పన్నీరు సెల్వం ఏదశలోనూ ఎమ్మెల్యేల మద్ధతు పొందేందుకు ప్రయత్నాలు చేయలేదు. శశికళ చెంతన ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఇదే సమయంలో శశికళకు వ్యతిరేకంగా గళం విప్పిన డీఎంకే, కాంగ్రెస్‌, ఇతర పక్షాలను ఏక తాటిపైకి తేవడంతో పాటు ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయలేకపోయారు. వీటికి తోడు తనవైపు వచ్చే ఎమ్మెల్యేలకు భరోసా కలిగించకపోవడం వల్లే పన్నీరు పరాజయం పాలైనట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


విపక్షాల 98 ఓట్లకు తన 12 ఓట్లు కలిపితే 110 మంది అవుతారు. ఈ సమయంలో మరో ఏడుగురిని తన వర్గంలో చేర్చుకుంటే పళని స్వామిని  ... పన్నీరు వర్గం సులువుగా అడ్డుకునేది. ఈ దిశగా వ్యూహరచన చేయని పన్నీరు ఆత్మప్రభోదానుసారం ఎమ్మెల్యేలు ఓటు వేయాలని పిలుపునిస్తూ .. రహస్య ఓటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్‌ ధన్‌పాల్‌ను కోరారు.  ఇందుకు స్పీకర్ ధనపాల్ నిరాకరించడంతో పన్నీరు ప్లాన్ ప్లాఫ్ అయ్యింది. దీనికి తోడు డీఎంకే ఎమ్మెల్యేలు సభలో రభస చేయడం.. స్పీకర్ బహిష్కరించడంతో ...  పన్నీరు సెల్వం వైపు రావాలనుకున్న ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడ్డారు. దీంతో పళని స్వామి సులువుగా విజయం సాధించగా .. పన్నీరు 11 ఓట్లకే పరిమితమయ్యారు.


అర్ధశాస్త్రంలో చాణక్యుడు చెప్పినట్టు విజయమే నీ లక్ష్యమైతే నడిచే దారి గురించి ఆలోచించకూడదన్న మాటను శశికళ వర్గం ఆచరణలో చూపగా ... అనుభవలేమి, వ్యూహరచన లోపంతో పన్నీరు పరాజయం పాలయ్యాడని తమిళ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: