కిమ్ జాంగ్.. ఒక నియంతగా, ఎవడి మాటా వినని సీతయ్యగా పేరు తెచ్చుకున్న ఈ 33 ఏళ్ల యువకుడు.. దేశంలో ఏదైనా తన కనుసన్నల్లో జరగాలంటాడు. తన ఆజ్ఞ లేకుండా అడుగేసినా అంతు చూస్తాడు. చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అలా ఇలా కాదు... అతి కిరాతకంగా.. ఎవరూ ఊహించనంత భయానకంగా ఉసురు తీస్తాడు. అయినా అతడే తమకు ఇష్టమైన నేత అంటారు అక్కడి ప్రజలు.


ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్‌ గురించి, అతడి పైశాచికత్వం, మితిమీరిన నియంతృత్వాన్ని ఎపిసోడ్లకు ఎపిసోడ్లుగా చెప్పవచ్చు. మూర్ఖత్వానికి, నియంతృత్వానికీ పరాకాష్టగా చెప్పుకునే ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడి కిరాతకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. హత్యలు చేయడమే కాదు.. వాటిని అతి కిరాతకంగా చేసేవాడు. కళ్ల ముందే వారి ప్రాణాలు తీసేవాడు. ఆ సమయంలో వారు అల్లల్లాడుతుంటే చూసి ఆనందించేవాడు. రాక్షసానందం పొందేవాడు.


అధికారంపై మరింతగా పట్టును పెంచుకోవాలనుకున్నాడో లేదంటే తన పైశాచికత్వాన్ని మరోసారి ప్రపంచానికి తెలపాలనుకున్నాడో కానీ... ఏకంగా ఉప ప్రధానిని కూడా ఉరి తీసేశాడు. ఎందుకు అంతపని చేయాల్సి వచ్చిందంటే మాత్రం చాలా సిల్లీ థింగ్‌. అతనేమీ దేశ ద్రోహానికి పాల్పడలేదు, అధ్యక్షుడిని కించపర్చలేదు. చేసిందల్లా చిన్న పొరపాటు మాత్రమే. తన అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఉప ప్రధాని సరిగా కూర్చోలేదన్న కారణంతో తన వికృత రూపం చూపించాడు. బహిరంగంగా ఉరి తీయించాడు.


ఇక... దేశ ద్రోహానికి పాల్పడ్డాడని హత్య చేయించిన తన మేనమామ మర్డర్‌లో మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. అతడికి మరణశిక్ష విధించిన ఉన్‌... శిక్ష అమలు సమయలో అతడిపై నూలుపోగుకూడా లేకుండా చేసి ఒక బోనులో బంధించాడని, ఆ బోనులోకి ఆకలితో ఉన్న వందకు పైగా కుక్కలను పంపి అత్యంత పాశవికంగా చంపించాడని అప్పట్లో చైనా పత్రిక ప్రచురించింది.


పక్కదేశం సౌత్‌కొరియాపై పగతో రగిలిపోయే ఉన్‌... ఆదేశం ఆనవాళ్లేవీ తన దేశంలో ఉండవద్దని కోరుకుంటాడు. అందుకే దక్షిణకొరియా దేశానికి చెందిన టీవీ ప్రోగ్సామ్స్‌ అన్నిటినీ ఉత్తరకొరియాలో నిషేధించాడు. అయినా ఖాతరు చేయక కొంతమంది ఆ సీరియల్స్‌ను టీవీల్లో చూశారు. అంతే.. అది తెలుసుకున్న కిమ్‌ ఉన్‌.. కిరాతకుడిగా మారాడు. తన మాట వినలేదన్న ఒకే ఒక్క కారణంతో 8మంది దేశ పౌరులను ఉరి తీయించాడు. ఇవి చాలవా అతని పైశాచికత్వం పరాకాష్టకు చేరిందని చెప్పడానికి.. ఇవి చాలవా అతను ఓ ఉన్మాదిలా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడని చెప్పడానికి. 


హత్యలు చేయించడం, అత్యంత ఘోరమైన శిక్షలు అమలు చేయడంలోనే కాదు... వివాదాస్పద వ్యాఖ్యలు, వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలోనే ఉన్‌ను మించినవారు లేరు. ఇప్పటివరకు పాలకులు, అధికారుల వరకే పరిమితమైన అతని ఆగడాలు.. రియో ఒలింపిక్స్‌ తర్వాత క్రీడాకారులకు పరిచయమయ్యాయి. ఆ క్రీడల్లో పోటీపడ్డ ఉత్తర కొరియా ప్లేయర్లకు  సైతం శిక్షను విధించారు కిమ్ జాంగ్. తాను చెప్పినన్ని పతకాలు తేలేదని మండిపడ్డ ఉన్‌... పతకాలు తెచ్చినవారికి ప్రోత్సాహకాలిచ్చాడు. ఉత్త చేతులతో వచ్చిన వారిని మాత్రం బొగ్గుగనుల్లో కూలీలుగా మార్చాడు.


అంతేకాదు.. కుక్క కనిపిస్తే చాలు కోసుకు తినేయండని కూడా ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు ఈ వివాదాస్పద అధ్యక్షుడు. కుక్క మాసం తింటే మంచిదని, అందులో ఎన్నో విటమిన్స్‌ ఉన్నందున చాలా బలం వస్తుందని కొత్తభాష్యం చెప్పాడు. ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్, బీఫ్, ఫోర్క్, బాతు మాంసాల కంటే కుక్క మాంసం ఎంతో బలవర్దకమైనదని.. దానిని కడుపునిండా తినేయండని ప్రకటించాడు. అలా తన పైశాచికత్వాన్ని దేశ ప్రజలకు కూడా అంటించే ప్రయత్నం చేశాడు.


ఇలా ఎన్నో హత్యలు.. మరెన్నో వివాదాస్పద నిర్ణయాలతో బయటి ప్రపంచంలో కిరాతకుడిగా ముద్ర వేయించుకున్న ఉన్‌పై... ఉత్తర కొరియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తనకు అడ్డుగా ఉన్నవారిని తప్ప, తన మాట వినని వారిని తప్ప మిగతా వారెవరినీ అతడు టచ్‌ చేయలేదు. అంతేకాదు... తన దేశం కోసం అగ్రరాజ్యాలతో ఢీ కొట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. అందుకే ఆ దేశ పౌరులు కూడా అతనంటే అభిమానం చూపిస్తారు. తమను రక్షించే నాయకుడిగా పరిగణిస్తారు. ఇదే... స్వదేశంలో అతని కత్తికి ఎదురు లేకుండా చేస్తోంది.. ఇదే ప్రత్యర్థుల నెత్తురు తాగడానికి కారణమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: