ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్‌ను ప్రపంచ మీడియా నియంతగా అభివర్ణించినా.. దేశ ప్రజల పాలిట యముడని ఎన్నో కథనాలను వడ్డి వారిస్తున్నా.. అతడిని దగ్గర నుంచి చూసిన వారు, ఆయన గురించి బాగా తెలిసిన వారు మాత్రం... ఆయ‌న మ‌న‌సు వెన్న అంటున్నారు. కిమ్ జాంగ్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఎన్నో సంక్షేమ ప‌నులు చేప‌ట్టారని చెబుతున్నారు.


కిమ్ జాంగ్‌కు ముందు ఆయన వంశస్తులందరూ మిలటరీకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా భావించి పేదల సంక్షేమానికి నిధులను తగ్గించేవారు. కానీ కిమ్ వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశాడని నార్త్‌ కొరియ‌న్లు చెప్పుకుంటున్నారు. కిమ్‌ ఉన్‌ పాలనకు ముందు. దేశ రాజధాని ప్యోంగాయంగ్‌లోకి సాధారణ ప్రజానీకానికి కనీసం ఎంట్రీ కూడా ఉండేది కాదట. కిమ్‌ అధ్యక్షుడయ్యాకే రాజధానిలోకి రాగలుగుతున్నామని అక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు.


అంతేకాడు... దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాడు. పాఠశాలలు, వ్యాయామ సెంటర్లు ఏర్పాటు చేశాడు. ఇక.. అక్కడ ప్రధానంగా చెప్పుకునే మేడే స్టేడియాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దాడు. రెండేళ్ల క్రితం నీటిపై తేలే ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ను నిర్మించి అందరినీ ఔరా అనిపించాడు. అయితే... ప్రజల సంక్షేమమే ప్రధానమనుకున్న కిమ్‌... రక్షణ వ్యవస్థను నిర్లక్ష్యం చేశాడా అంటే అదేమీ కాదు. దేశ సైనికుల కోసం ప్రత్యేక భవనాలనే నిర్మించాడు కిమ్‌ జాంగ్‌. ఇలా రెండింటిని రెండు కళ్లలా చూసుకుంటున్నాడు.


ప్రపంచదేశాలన్నీ అణ్వాయుధాలను తమ అమ్ములు పొదిలో చేర్చుకోవాలని తపన పడుతున్న ఈ సమయంలో... కిమ్‌ జాంగ్‌ కూడా ఆ దిశగా అడుగులు వేశాడు. తమ ఆర్మీకి బలమైన అస్త్రాలు అందించాలని తపనపడుతున్నాడు. అందుకే... ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నా, అగ్రరాజ్యాలు గగ్గోలు పెడుతున్నా.. గతేడాది రెండు అణు పరీక్షలు, ఓ క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేసి చూపించాడు. అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రూపొందించే పనిలో పడ్డాడు.


అణు పరీక్షలు జరిపే దేశాలపై ఆంక్షలు విధిస్తున్నా... పెద్దన్నలు హెచ్చరిస్తున్నా వినకుండా అణు పరీక్షలు నిర్వహించామని న్యూ ఇయర్ స్పీచ్‌లో ప్రకటించారు కిమ్‌ జాంగ్‌. అంతేకాదు... బాలిస్టిక్ మిస్సైల్‌ రూపకల్పనలో చివరిదశకు చేరుకున్నామని చెప్పారు. ఆత్మరక్షణ కోసమే అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నామన్న కిమ్‌... అమెరికా లాంటి దేశాలను ఢీకొట్టాలంటే ఇలాంటి తప్పదన్నారు. బలమైన వారిగా భావిస్తున్న ప్రత్యర్థులు తమ దేశంపై ఇప్పుడు యుద్ధానికి రావచ్చని సవాల్‌ విసిరారు.


ఇలా తన తీరుతో దాయాది దేశమైన సౌత్‌ కొరియాతోనే కాదు.. చైనా, అమెరికా జపాన్‌ తోనూ శత్రుత్వం పెంచుకుంటున్న కిమ్‌ జాంగ్‌పై ఆ దేశ ప్రజల్లో మాత్రం సానుభూతి వ్యక్తమవుతోంది. అమెరికాతో ఉన్న వైరమే అతడికి చెడ్డపేరు తెస్తోంది తప్ప... నిజానికి కిమ్ జాంగ్ చాలా మండివాడ‌ని కీర్తిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: