ఇంజక్షన్‌ ఇవ్వడం వస్తే డాక్టరైపోవచ్చు.. సెలైన్‌ ఎక్కించడం వస్తే ఎంబీబీఎస్‌లా ఫోజులు కొట్టొచ్చు. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవచ్చు. ఇదే ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న నయా ట్రెండ్. టెన్త్‌ క్లాస్‌ దాటనివారు, ఇంటర్‌ ఫెయిలైనవారు ఆర్‌ఎంపీలుగా అవతారమెత్తి గ్రేట్‌ డాక్టర్స్‌గా చలామణి అవుతున్నారు. పెద్దాస్పత్రులతో కుమ్మక్కై రోగులను నిండా ముంచేస్తున్నారు.


ఇసుక మాఫియా... లిక్కర్‌ మాఫియా...స్మగ్లింగ్‌ మాఫియా... ఇవే ఇప్పటివరకు మనకు తెలిసిన మాఫియాలు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త మాఫియా వెలుగు చూసింది. అదే మెడికల్‌ మాఫియా. మాఫియా ముఠాలు అంటేనే అరాచకాలకు కేరాఫ్‌ అడ్రస్‌లు... సంపాదనే అంతిమ లక్ష్యంగా పనిచేసే ఖతర్నాక్‌ గ్యాంగ్‌లు. అలాంటి జాబితాలో సరికొత్తగా వచ్చిచేరారు డాక్టర్లు. 


సృష్టికి ప్రతి సృష్టిచేసే వారుగా.. మనిషి రూపంలో ఉండే దేవుడిగా భావించే వైద్యుల్లో చాలామంది కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. అడ్డగోలు సంపాదనకు ఆశపడుతున్నారు. అందుకోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ప్రైవేట్‌ ఆస్పత్రులు, వాటిల్లో వైద్యం అందిస్తున్న పేరుమోసిన డాక్టర్లు... అనైతికతకు అతుక్కుపోతున్నారు. స్వల్ప వ్యవధిలోనే ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో పక్కదారులు తొక్కుతూ... తెల్లటి చొక్కాల మాటున ఎర్రటి రక్తం లాంటి ప్రజల కష్టార్జితాన్ని కోసుకు తింటున్నారు. 


కొత్త ఆస్పత్రికి రోగులు ఎలా వస్తారు? అక్కడ ఫలానా వైద్యుడు ఉన్నాడని రోగులకు ఎలా తెలుస్తుంది? ఇందుకోసం ఆ వైద్యులు, ఆస్పత్రి నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీలతో కుమ్మక్కవుతున్నారు. కమీషన్లను ఎరగా వేస్తున్నారు. అప్పుడప్పుడూ విందు వినోదాలతోపాటు విలువైన బహుమతులనూ అందిస్తున్నారు. రోగులను తమ దగ్గరికి పంపితే ఇంత... బిల్లును బట్టి పర్సంటేజీ ఇంత అంటూ దందా కొనసాగిస్తున్నారు. ఆ ఆస్పత్రుల ఆఫర్స్‌కు అట్రాక్ట్‌ అవుతున్న ఆర్‌ఎంపీలు... తమ దగ్గరకు వచ్చే పేషెంట్ల అనారోగ్యాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. సాధారణ చికిత్సకు తగ్గే వ్యాధులకు కూడా రకరకాల టెస్టులు చేయాలని, స్కానింగ్‌లు, ఎక్స్‌రేలు అవసరమవుతాయని భయపెడుతున్నారు. అంతేకాదు... తమకు తెలిసిన ఆస్పత్రిలో తక్కువ ధరకే అంతా అయిపోతుందంటూ ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు.


వారి మాటలు నమ్మి ఒక్కసారి అతడు చెప్పిన ఆస్పత్రికి వెళ్తే అంతే సంగతులు. ఆ టెస్టులు, ఈ టెస్టులంటూ ఇంతవరకు తిరగని చోట్లన్నిటికీ తిప్పిస్తారు. ఏవేవో చెప్పేసి ఆఖరికి ఆపరేషన్‌ తప్పదంటూ హడలెత్తిస్తారు. సుఖ ప్రసవం కావాల్సిన గర్భిణీలకు సైతం కాసుల కక్కుర్తితో కోతలు పెడతారు. కడుపులో నొప్పి అంటే చాలు అపెండిసైటిటస్‌ ఆపరేషన్‌ చేసేస్తారు. ఇలా.. అందినకాడికి పిండుకుంటారు. 


ఈ దందా అక్కడితో ఆగదు... పల్లెల నుంచి పట్టణానికే పరిమితమైన ఈ తంతు.. అక్కడి నుంచి నగరానికి చేరుతుంది. సిటీల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులతో చేతులు కలిపిన పట్టణాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులు... తమ వద్దకు వచ్చే కొన్ని కేసులను వాటికి రిఫర్‌ చేస్తుంటాయి. ఇక ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే... ఆ కార్పొరేట్‌ హాస్పిటళ్లు తమ ఖజానా నింపుకునే పనిలో పడతాయి. అవసరమైతే ఆస్తులను కూడా అమ్ముకునేలా చేస్తాయి. ఇలా... ఇటు అన్నీ తెలిసిన కార్పొరేట్‌ వైద్యుడు.. అటు ఏమీ తెలియని కన్నింగ్‌ వైద్యుడు కలిసి అభం శుభం తెలియని రోగులను నిండా ముంచుతున్నారు. ఆర్థికంగానే కాదు... ఆరోగ్యపరంగానూ నిర్వీర్యం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: