దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ గతంగా మారనుందా ? దేశ వ్యాప్తంగా వరుసగా  వెలువడుతున్న  ఎన్నికల ఫలితాలు పార్టీని తిరోగమనంలోకి తీసుకెళుతున్నాయా? పార్టీని నడిపించే నాయకుడిపై .. .కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లిందా ? ప్రస్తుత పరిసితుల్లో  పార్టీని నడపడం యువరాజు రాహుల్‌కు గగనంగా మారిందా ? అంటే అవుననే సమాధానాలు ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపిస్తున్నాయి.  132 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, స్వతంత్ర్య పోరాట నేపధ్యం, అపారమైన పాలన నైపుణ్యం ఉన్నా పార్టీ పరిస్ధితి రోజురోజుకు దిగజారడం కార్యకర్తలను  ఆందోళనకు గురి చేస్తోంది. ఇక పార్టీకి వరంగా ఉండాల్సిన సీనియర్లు శాపంగా మారుతున్నారంటూ క్షేత్ర స్ధాయి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


దేశ రాజకీయాలను తన కంటి చూపుతో శాసించిన కాంగ్రెస్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది. వరుస పరాజయాలు చెల్లా చెదురవుతున్న కేడర్‌తో  భవిష్యత్‌ అంథకారంగా మారింది. పరిస్ధితిని చక్కదిద్ది క్షేత్రస్ధాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అధినాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ... ఫలించడం లేదు.  ఒకప్పుడు  దేశంలోని రాష్ట్రాలను తన గుప్పిట్లో పెట్టుకుని సీల్డ్ కవర్ల ద్వారా ముఖ్యమంత్రులను నియమించే పార్టీ.. ఇప్పుడు అస్ధిత్వం కోసం పోరాడాల్సిన పరిస్ధితి నెలకొంది. దేశంలో 32 రాష్ట్రాలకు గాను కేవలం ఆరంటే ఆరు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో కొనసాగుతోందంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.  దేశ రాజకీయాలను శాసించే ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్ధాన్‌, పశ్చిమ బెంగాల్‌, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్‌ రాష్టాల్లో పార్టీ నామమాత్రంగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 345 స్థానాలకు గాను కేవలం 14 స్ధానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఏపీ, రాజస్ధాన్‌, తమిళనాడు రాష్టాల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకో లేకపోయింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో సోనియా, రాహుల్ తప్ప మరో అభ్యర్ధి విజయం సాధించలేకపోయారు.


తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కేవలం పంజాబ్‌లో తప్ప.. మరోచోట అధికారంలోకి రాలేకపోయింది. మణిపూర్‌, గోవాల్లో.. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా నిలిచినప్పటికీ.. అధికారంలోకి రాలేకపోయింది. ఒకప్పుడు మెజార్టీ లేకున్నా.. తిమ్మిని బమ్మి చేసి అధికారంలోకి వచ్చే టెక్నిక్‌లు ఆ పార్టీ సొంతం. కానీ,ఇప్పుడు సీన్‌ కంప్లీట్‌గా రివర్స్‌ అయింది. ఇదంతా వ్యూహకర్తలు లోపమే అని స్పష్టంగా అర్ధమవుతోంది. ఒకవైపు రాహుల్‌ గాంధీ.. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాళ్లరిగేలా తిరిగినా.. అక్కడ హస్తంపార్టీ నామమాత్రంగానే మిగిలిపోయింది. అఖిలేశ్‌తో చర్చలు జరిపి వంద స్థానాల వరకూ పోటీ చేసిన కాంగ్రెస్‌.. కనీసం పది సీట్లలో కూడా గెలవలేకపోయింది. ఉత్తరాఖండ్‌లో హరీశ్‌ రావత్‌పైనే అన్ని ఆశలు పెట్టుకుంది హైకమాండ్‌. అయితే తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడంతో హరీశ్‌ రావత్‌ స్టామినే ఏంటో అధిష్టానంకు తెలిసి వచ్చింది. ఇక పంజాబ్‌లో ఒక్కటి అమరేందర్‌ సింగ్‌ ప్రతిభతో గట్టెక్కగలిగింది. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌.. ఇప్పుడు అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రాలు అంటే.. కర్ణాటక, పంజాబ్‌ మాత్రమే. అంటే హస్తవాసి నానాటికీ.. ఎలా సన్నగిల్లిపోతుందో అర్ధమవుతోంది.


అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ.. ప్రచారంలో కీలకపాత్ర పోషించలేకపోయారు. ప్రచార బాధ్యత అంతా రాహుల్‌ గాంధీ మోస్తే.. ప్రియాంక వాద్రా తన సోదరుడుకి కొంచెం సహకరించారు. పార్టీ గెలిచినప్పుడు ఆ క్రెడిట్‌ అంతా రాహుల్‌ గాంధీకి కట్టబెట్టే కాంగ్రెస్‌.. పార్టీ ఓడినప్పుడు మాత్రం దాంతో రాహుల్‌కు ఏమాత్రం సంబంధం లేదన్నట్లు రియాక్ట్‌ అవుతోంది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఇంత ఘెరంగా వచ్చినా.. ఎక్కడా మేధోమధనం అన్నది మొదలైనట్లు కనిపించడంలేదు. ఈ ఓటములకు కారణమైన వారిపై చర్యలు కూడా తీసుకోవడంలేదు. అధికారంలోకి రావాల్సిన మణిపూర్‌, గోవా లాంటి చోట్ల కూడా.. ఇప్పుడు ప్రతిపక్షంగా మిగిలిందంటే.. అదంతా ఢిల్లీలోని హస్తం పెద్దల వైఫల్యమే. గతంలో ఇలాంటి పరిస్థితుల్ని హ్యాండిల్‌ చేసిన ట్రబుల్‌ షూటర్లు.. ఇప్పుడు కనుచూపుమేరలో కనిపించడంలేదు. ఇంత నిరాశ, నిస్పృహలు.. కాంగ్రెస్‌ను మరింత డీలా పడేలా చేస్తున్నాయి. ఫలితాల్లో ఉత్సాహాన్ని ఇవ్వకపోగా.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు.. కాంగ్రెస్‌కు మింగుడుపడడంలేదు. ఒకవైపు బీజేపీ హవా రోజురోజుకూ పెరిగిపోతుంటే.. కాంగ్రెస్‌ ప్రభ మాత్రం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. మరి, ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ను ఆదుకునేది ఎవరు ? హస్తంపార్టీ మళ్లీ ట్రాక్‌లోకి రావడం సాధ్యమేనా ? 2019 నాటికి పార్టీ పరిస్థితి ఏమవుతుందనేది ఇప్పుడు హస్తం నేతల్లో చర్చనీయాంశమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: