తెలుగు రాష్ట్రాల్లో అధికార పీఠం దక్కడంలో సక్సెస్ ఫుల్ అయిన రుణమాఫీ ఫార్ములా.. ఉత్తరాది రాష్ట్రాలకూ పాకింది. యూపీలోనూ ఈ హామీ ఇచ్చిన పార్టీ గద్దెనెక్కింది. రుణమాఫీ సరికాదంటూ ఇన్నాళ్లూ సన్నాయి నొక్కులు నొక్కిన కేంద్రం పెద్దలు.. ఇప్పుడు కీలకమైన రాష్ట్రంలో పవర్ కోసం.. అదే టెక్నిక్ ప్రయోగించారు. అసలు రుణమాఫీ అనేది.. రైతు సమస్యలను తీరుస్తుందా ? మాఫీతో అన్నదాతల కష్టాలు తొలగిపోతాయా ? ఏపీ, తెలంగాణ.. నేర్పిన పాఠాలు ఏంటి ?


కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా మారింది ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీ పరిస్ధితి. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న చిన్న,సన్నకారు, మధ్యతరగతి రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రధాని  ప్రకటించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఆశాజనకంగా లేదనే విషయం  ప్రధాని స్ధానంలో ఉన్న మోదీకి తెలిసినా.. ఈ వాగ్ధానం చేయడం వెనక ఓట్లు కొల్లగొట్టే ఎత్తుగడ ఉంది. కుల రాజకీయాలు వేళ్లూనుకున్న యూపీలో అన్ని కులాల వారిని ఏకం చేసి గుంప గుత్తగా ఓట్లు సాధించాలంటే.. సాధ్యమయ్యే పని కాదని భావించిన మోదీ రుణమాఫీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇదే సమయంలో తనపై నమ్మకం కలిగే పూర్వాంచల్ ప్రాంతంలో సంవత్సరాల తరబడి పేరుకుపోయిన చెరుకు రైతుల బకాయిలను చెల్లించారు. దీంతో కులమతాలను పక్కనబెట్టిన అధిక శాతం రైతులు కాషాయ దళానికి ఓటు వేసి  గెలిపించారు. ఇక్కడి దాకా బాగానే ఉన్నా ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిల చెల్లింపు రాష్ట్రానికి  పెద్ద గగనంగా మారింది. సుమారు 87  వేల కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఇందులో చిన్నసన్నకారు రైతుల బకాయిలు  27  వేల 419 కోట్ల వరకు ఉన్నాయి.

ఏపీ, తెలంగాణ నుంచి మొదలైన రుణమాఫీ.. ఇప్పుడు యూపీ వరకు పాకింది. అక్కడితో ఆగకుండా మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. మొదట్లో రుణమాఫీని వ్యతిరేకించిన కేంద్రం.. ఇప్పుడు యూపీకి మాఫీ చేయడంపై టీఆర్ఎస్తో పాటు జనసేన పార్టీలు తీవ్రంగా స్పందించాయి. కేంద్రం ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కోలా చూడటం తగదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యనించగా.. జనసేన అధినేత వవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య తగవు పెట్టవద్దంటూ ట్వీట్ చేశారు. 

అయితే రైతు సమస్యలకు రుణమాఫీనే పరిష్కారమా అంటే.. కాదు అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే.. ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు రుణమాఫీ చేయడం సరికాదన్నారు బ్యాంకింగ్ నిపుణులు.   వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం వల్ల  క్రెడిట్ క్రమశిక్షణకు భంగం కలుగుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో యూపీఏ హయాంలో రుణమాఫీ జరిగినప్పుడు.. అర్హులు కాని వారే ఎక్కువగా లబ్ధిపొందారు. కొందరు లబ్ధి పొందినా నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వనందు వల్ల చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల కొత్తగా రుణాలు పొందాలన్న రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు కేవలం బ్యాంకుల నుంచి పొందిన అప్పులను మాత్రమే ప్రభుత్వాలు రద్దు చేస్తున్నాయి. అయితే ప్రైవేటు అప్పుల గురించి అవి పట్టించుకోవు. దానివల్లే తెలంగాణలో చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో ఈ అంశాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఒక మైనస్ పాయింట్. అంతేకాకుండా కరవు, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పట్టించుకోకుండా.. అన్ని ప్రాంతాల్లోనూ రుణమాఫీ ఒకే విధంగా అమలు చేయడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు.

ఇక రుణమాఫీ అని ప్రభుత్వాలు ప్రకటించడంతో.. అప్పు తిరిగి చెల్లించే స్థోమత కలిగినవారు కూడా చెల్లించడం మానేస్తారు. దానివల్ల బ్యాంకింగ్ రంగం దెబ్బతింటుంది. రుణాలు ఇవ్వడం.. వాటిని వసూలు చేసుకోవడం వంటివి పక్కాగా జరిగినప్పుడే క్రిడెట్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఇలా జరగనప్పుడు బ్యాంకుల మూలసూత్రానికి విఘాతం కలుగుతుంది. ఈ కారణాలన్నింటి వల్ల రైతుల సమస్యలకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదనేది స్పష్టమవుతోంది. రుణమాఫీకన్నా.. ఇతర అంశాలపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలని రైతు సంఘాలు, బ్యాంకింగ్ నిపుణులు కోరుతున్నారు.  రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో పెట్టుబడి వ్యయం ప్రధానమైనదని  .. దీని నివారణకు సబ్సిడీలతో కూడిన వితరణ అమలుచేయాలని సూచిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు, ఆధునిక యంత్రాల వినియోగంపై భారీ సబ్సిడీలు అందించడం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో పెట్టుబడి వ్యయం తగ్గించడం, దిగుబడి పెంచడం ఒక్కటే మార్గం కాదని  .. బహుళ అవకాశాలు స్పష్టించడం, వ్యాపార, వాణిజ్య రంగాల్లో రైతులు ప్రవేశించేలా ప్రణాళికలు అమలు చేయడం, నాణ్యమైన ఉత్పత్తులకు బాటలు వేయడం, దేశంలో రైతులు ఉత్పత్తి చేస్తున్న పంటలను విదేశాలకు తరలించేలా చర్యలు తీసుకోవడం వల్ల రైతులకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దేశంలో పండే పంటకు  ఒకప్పుడు విదేశాల్లో మంచి గారికి ఉండేదని  ..కాని రసాయనాల వినియోగం విస్తరించే కొద్ది విదేశాల్లో భారత ఉత్పత్తులు  నిషేధానికి గురవుతున్నాయని  ..  సేంద్రీయ సాగును ప్రోత్సహించడం వల్ల ఈ సమస్యల నుంచి అధిగమించవచ్చంటున్నారు.  దిగుబడులను కాకుండా ఆదాయాలను రెట్టింపు చేసినప్పుడే రైతుల సమస్యలు తీరి.. దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. రుణమాఫీకన్నా రుణాల రీషెడ్యూలింగ్.. పంటలు నష్టపోయినప్పుడు పంటల భీమా పథకాల్ని సమర్ధంగా అమలు చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందనేది వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: