ఇబ్రహీంపట్నం  భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఖండించారు.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 38 ఎకరాల భూమి విషయంలో తన కూతురు, కోడలుపై వచ్చిన ఆరోపణలపై ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గోల్డ్ స్టోన్ పార్థసారధి నుంచి భూములు ఎందుకు కొన్నారు? ఆయన కబ్జా కోరు అని తెలియకుండానే కొన్నారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే సహనం కోల్పోయారు. 


భూ కుంభకోణం ఆరోపణలపై కేకే వివరణ

 అయితే 'గోల్డ్ స్టోన్ పార్థసారధి ఎలాంటివాడో తెలియదా?' అని మీడియా ప్రతినిధి రెట్టించడంతో ఆయన సహనం కోల్పోయారు. 'నేనేమన్నా బిచ్చగాడననుకున్నావా? సారూ...బ్యాక్ గ్రౌండ్ తెలియకుండా కొనడానికి?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించే ప్రయత్నం చేయడంతో....'నేనేం చెప్తున్నానో అర్ధం చేసుకోండి...నీ కంటే పెద్ద జర్నలిస్టునే నేను' అంటూ మండిపడ్డారు.



2013లో అగ్రిమెంట్‌ చేసుకుని 2015లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని దండు మైలారంలో భూములు కొన్నామని, అయితే తాము వివాదంలో ఉన్న భూములు కొనలేదని తెలిపారు. భూముల కొనుగోలు పూర్తిగా చట్టప్రకారమే జరిగిందన్నారు. తమ కుటుంబం 50 ఎకరాలు కొన్న మాట వాస్తవమేనని, రెవెన్యూ పత్రాలు కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆ భూములు కొన్నట్లు కేకే తెలిపారు. చట్టప్రకారమే భూములు కొన్నానని, తాను దొంగను కాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: