త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉంది. వాస్తవానికి మోడీ రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా నియమించాలని ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు రాజ్‌నాథ్‌ సింగ్‌, వెంకయ్య నాయుడు టెన్‌ జన్‌పథ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాతో సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన భేటీలో కాంగ్రెస్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు.



ఇందులో వారు రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే అంశాన్ని లేవనెత్తగా అందుకు సోనియా గాంధీ ప్రతిస్పందిస్తూ.. ముందు మీరు అభ్యర్థిని ఖరారు చేయండి, అభ్యర్థి సరైన అభ్యర్థి అనిపిస్తే మీము మా పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపి మద్దతు తెలపాలో, లేదో అనే విషయాన్ని ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. భేటీ ముగిసిన అనంతరం ఆజాద్‌, ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘అధికార పక్షం తమ తరఫు అభ్యర్థి ఎవరో చెప్పకుండా మా సహకారం అడిగితే ఎలా? బీజేపీ ఏకాభిప్రాయం కోసం కాకుండా... కేవలం మా సహకారం కోరడానికే వచ్చినట్లుంది’’ అని అన్నారు. 


వేడెక్కిన ‘రాష్ట్రపతి’ రాజకీయం

ఇదే అంశంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్ సింగ్ లు క‌లిశారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎన్డీఏ ఎవ‌రిని నిల‌బెడుతుందో ఏ పేరునూ వారు తనకు చెప్ప‌లేద‌ని అన్నారు. అభ్య‌ర్థి పేరు చెప్ప‌కుండానే త‌మ‌ మద్దతను కోరింద‌ని అన్నారు. మద్దతు ఇవ్వాలంటే అభ్యర్థి ఉండాలని, ఆ అభ్యర్థి రాజ్యాంగాన్ని పరిరక్షించ గలిగే వ్యక్తి అయి ఉండాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: