బంజారాహిల్స్ లో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పాశ్చాత్య నాగరికత ప్రభావమో, సినిమాల ప్రభావమో తెలియదుగానీ అమ్మాయిలపై ఐటీ హబ్ ప్రాంతంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. పోలీసులు అర్థరాత్రుల్లు సైతం పహారా కాస్తున్నా పోకిరీల ఆగడాలకు మాత్రం హద్దు లేకుండా పోతుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అనకూడని మాటలు అనడంతోపాటు బైక్‌లు దిగి వెళ్లి ఆ యువతిపై చేయి చేసుకున్నారు.
మొత్తం ఆరుగురు యువకులు ఆ యువతిని టీజ్ చేశారు. ధైర్యవంతురాలైన ఆ యువతి ప్రతిఘటించింది. ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు విషయాన్ని గమనించి అక్కడకు చేరుకుంటుండడంతో ఆ అమ్మాయిని వారు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ నెల 11న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులకు పోకిరీలు పాల్పడిన దుశ్చర్యలకు సంబంధించిన ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. వారు దొరికిన తర్వాత కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.