భార్యా, భర్తల బంధానికి... అక్రమ సంబంధాలు తూట్లు పొడుస్తున్నాయి. చేతిలో చేయి వేసి చేసిన పెళ్లినాటి ప్రమాణాలు.. వ్యామోహాల భారిన పడి చెరిగిపోతున్నాయి. కష్టంలో సుఖంలో తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన.. భర్తనే కడతేర్చే స్థాయికి చేరాయి...


హైదరాబాద్ కర్మన్ ఘాట్ ప్రాంతానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో జ్యోతికి ఐదేళ్లక్రితం వివాహం జరిగింది. కానీ అప్పటికే కార్తీక్ అనే వ్యక్తితో అఫైర్ పెట్టుకున్న జ్యోతి పెళ్లి తర్వాత కూడా ఆ ఆక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలనే క్రూరమైన ఆలోచనకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కట్టుకున్నవాడనే కనికారం కూడా లేకుండా చంపడానికి డిసైడ్ అయిపోయింది. గత నెల 30వ తేదీన భర్తకు నిద్రమాత్రలిచ్చింది. ఆ తర్వాత ప్రియుడు కార్తీక్ ను ఇంటికి పిలిపించి ఇద్దరు కలిసి నాగరాజును హత్య చేశారు.. పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం కార్తీక్ తన స్నేహితులైన దీపక్, యాసిన్ ల సాయం కోరాడు. పాపంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చిన దీపక్.. లాలాపేట లక్ష్మీనగర్ కు చెందిన నరేష్ ను తనతో తీసుకెళ్లాడు. కార్తీక్, దీపక్, నరేష్ కలిసి నాగరాజు మృతదేహాన్ని కారులో వేసుకుని చౌటుప్పల్ జిల్లెలగూడ గుట్టల్లో పారేసి తిరిగివెళ్లిపోయారు.


31న డెడ్‌బాడీని గుర్తించిన చౌటుప్పల్‌ పోలీసులు హత్య కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన  పోలీసులు మృతుడిని నాగరాజుగా గుర్తించి జ్యోతికి సమాచారం అందించారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. బుధవారం నిందితుల్లో ఒకడైన దీపక్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన దీపక్ సోదరుడు.. ఆ రోజు నరేష్‌ కూడా దీపక్‌తో వెళ్ళినట్లు తెలుసుకున్నాడు. దీంతో లక్ష్మీనగర్‌లోని నరేష్‌ ఇంటికి వెళ్ళిన దీపక్‌ సోదరుడు.. ఇలాంటి పని చేస్తారా అంటూ నరేష్ పై చేయి చేసుకున్నాడు. తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భావించిన నరేష్‌ పోలీసులకు స్వయంగా లొంగిపోవాలనుకున్నాడు. గురువారం ఉదయం ‘100’కు ఫోన్‌ చేసి తనకు ఓ హత్య విషయం తెలుసని... పోలీసులకు చెప్పాలనుకుంటున్నానని ఎలా చెప్పాలంటూ అడిగాడు. చేసిన తప్పును ఒప్పుకుని పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలనుకున్న నరేష్... లాలాపేటలోని గడ్డిచేను వద్దకొచ్చాక.. హత్య కేసు తనకు చుట్టుకుంటుదన్న భయంతో... బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నరేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు..

Image result for hyderabad murder

ఆసుపత్రిలో చేరిన నరేష్.. జరిగిన ఘటనపై పోలీసులకు వివరాలు వెల్లడించాడు. గత నెల 30న తన స్నేహితుడు దీపక్‌ తనను తీసుకువెళ్లాడని... అతడు మరికొందరితో కలిసి హైటెక్‌ సిటీలో సాఫ్ట్ వేర్‌ ఉద్యోగం చేసే ఓ వ్యక్తిని చంపినట్లు తెలిపాడు. ఆపై తాము మృతదేహాన్ని నల్లగొండ చెరువులో పారవేశామన్నాడు. మిగిలిన వాళ్ళు పోలీసులకు చిక్కడంతో తాను భయపడ్డానని వెల్లడించారు. ఈ విషయం విని కంగుతిన్న లాలాగూడ పోలీసులు మాదాపూర్‌ పోలీసుల్ని సంప్రదించినా ఫలితం దక్కలేదు.. నరేష్ చెప్పిన వివరాల్లో స్పష్టత లేకపోవడంతో... దీపక్ ఫోన్ నంబర్ కనుకున్న పోలీసులు... అతడి కాల్ డీటైల్స్ ఆరా తీశారు. అందులో ఓ నంబర్ కు ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. ఆ నంబర్ కు ఫోన్ చేస్తే చౌటుప్పల్ పోలీసులు కాల్ లిఫ్ట్ చేసి కార్పెంటర్ నాగరాజు హత్య గురించి మొత్తం వివరించారు. ఆ వివరణతో హత్యకు గురైంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజు కాదు.. కార్పెంటర్ నాగరాజు అని కన్ఫార్మ్ చేసుకున్న లాలాగూడ పోలీసులు... చికిత్స అనంతరం నరేష్ ను చౌటుప్పల్‌ పోలీసులకు అప్పగించారు.. తాజాగా జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో మొత్తం మ్యాటర్ ను ఆమె అంగీకరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: