కత్తి మహేష్ బిగ్ బాస్ ముందు వరకు అసలు అతనెవరో తెలుగు ప్రేక్షకులకు తెలియదు. ముందుగా అడపాదడపా తెరమీద కనిపించినా పెద్దగా గుర్తుపెట్టుకొనే పాత్రలేమీ చేయలేదు. అయితే బిగ్ బాస్ పుణ్యమా అని బుల్లితెర ప్రేక్షకులకి పరిచయస్తుడయ్యాడు. తానో ఫిలిం క్రిటిక్ అని తనను తాను పరిచయం చేసుకొనే ముందువరకూ అసలు కత్తి మహేష్ సినిమాలకు సంబందించిన వ్యక్తి అని జనాలకి తెలియదంటే అతిశయోక్తి కాదు.


బిగ్ బాస్ కార్యక్రమం ముచ్చట్లు తెలుపడానికి ఒక వార్తా ఛానెల్ కు వచ్చిన ఆయన సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలు ఒక నటుడు కాదు, ఆయనకు నటించడం రాదు అని వార్తలకెక్కాడు. తాను ఏ ముహూర్తాన ఆ మాటలు అన్నాడో కాని ఆయన మాటలు శరవేగంగా వైరల్ అయ్యాయి. ఆయన మాటలే కాదు ఆయన ఫోన్ నంబరు అంతే స్పీడుతో ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది.


అసలే కత్తి వాఖ్యల మీద వేడిగా ఉన్న పవన్ అభిమానులకు కత్తి ఫోన్ నంబర్ దొరకడంతో అసలు సీను ఇక్కడినుండే మొదలయింది. నిమిషానికి 60 సెకండ్లు అయితే ప్రతి అర సెకనుకు కత్తికి ఫోను చేసి, ప్రతి మిల్లీ సెకనుకు రాయలేని అసభ్య పదజాలంతో సందేశాలు పంపిస్తూ కత్తికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. దీనితో చిర్రెత్తుకొచ్చిన కత్తి మహేష్ తాను కూడా తన పదునైన మాటలతో ఎదురుదాడికి దిగాడు. 


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన ఈ పనికి స్వయంగా పవన్ వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. భారత  స్వతంత్రదేశంలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ. నా హక్కును నేను వాడుకుంటున్నాను, నేను ఈ దేశంలో ఎవరినైనా ప్రశ్న వేయవచ్చు అని తెలుపుకుంటూ పవన్ పైన విమర్శలు చేస్తూ వచ్చాడు. రాజకీయ నాయకుడిగా ఉండటానికి పవన్ కల్యాణ్ పనికిరాడు అసలు అతనికి ఏమి అర్హతలు ఉన్నాయి అని చురకలు అంటించాడు. కత్తి వ్యవహారంతో విసిగిపోయిన సినీ పెద్దలు, నటులు కూడా పవన్ కు మద్దతు తెలుపుతూ వాఖ్యలు చేశారు. 


రచయిత, నిర్మాత కోనవెంకట్ పవన్ కు మద్దతు తెలిపాడు. అతను మంచోడంటూ కితాబు ఇచ్చాడు. కానీ కత్తి మహేష్ ధాటికి విలవిల్లాడింది నటి పూనమ్ కౌర్. పవన్ కు మద్దతుగా మాట్లాడి ఉంటే సరిపోయేదేమో కానీ కత్తిని ఉద్దేశించి బండోడు, బిచ్చగాడు అని ట్విట్టర్లో స్పందించడంతో కత్తి దెబ్బకు బలి అయిపోయింది. కత్తి మహేష్ వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక పవన్ ను నన్ను ఈ ఊబి నుండి గట్టెక్కించండి అని వేడుకుందంటే కత్తి తన కత్తికి ఎలా పదును పెట్టాడో ఊహించవచ్చు.


ఇక ముదిరిన వివాదాన్ని ఇక ఫుల్ స్టాప్ పెట్టలేము అని అనుకున్న టైంలో పవన్ అభిమానులు కత్తిపైన కోడిగుడ్లతో దాడి చేయడంతో వివాదం ఒక కొలిక్కి వచ్చింది. దాడి చేసిన వారిపైన కత్తి కేసులు పెట్టడం, వారి కుటుంబ,భవిష్యత్ పరిస్థితుల దృష్ట్యా కేసును వాపసు తీసుకోవడం జరిగిపోయింది. ఇక వివాదాన్ని ఆపదలిచాను అని కత్తి మహేష్ ఒక వార్తా ఛానెల్ ద్వారా స్టేట్మెంట్ ఇవ్వడం, పవన్ ఫ్యాన్స్ తో కత్తి రెస్టారెంట్లో పార్టీ చేసుకోవడం అన్నీ చకచకా జరిగిపోయిన విషయం తెలిసినదే.


ఈ సెటిల్మెంట్ల వ్యవహారంలో ఒక పెద్ద హీరో, ఒక బడా నిర్మాత క్రియాశీలకంగా వ్యవహరించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో వెధవలు ఎవరు అన్న ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు తోచినట్లు అనేసుకుంటున్నారు. అయితే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు అన్నవారే వెధవలా ? అంటే కాస్త అలోచించాలేమో!


ఏదీ ఏమయినప్పటికీ కత్తి వివాదంను ప్రసారం చేసి టీవీ ఛానళ్ళు బాగానే రేటింగును రాబట్టాయి. మరి టీఆర్పీ రేటింగ్ కోసం ఛానళ్ళు ఇంక ఏ కొత్త వివాదాన్ని ఫోకస్ చేస్తాయో అని ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: