గత సాధారణ ఎన్నికలలో జగన్ గెలుస్తాడని అందరూ ఊహించారు కానీ అనూహ్యంగా టీడీపీ కి బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ ల మద్దతు లభించడంతో ఇక జగన్ కు ఓటమి తప్పలేదు. మొన్న జరిగిన నంద్యాల బై ఎలక్షన్స్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల్లో విజయం సాధించి 2019 సార్వత్రిక  ఎన్నికలకు ముందు పార్టీ నేతలు, కార్యకర్తలలో ఒక నూతనోత్సాహాన్ని నింపాలని భావించినా ఇక్కడ కూడా జగన్ కు ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించి సీఎం గద్దెక్కాలనుకుంటున్నాడు. ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.


అయితే చిత్తూరు జిల్లాలో తన పాదయాత్రను  నిన్నటితో ముగించాడు. కాగా జగన్ చేస్తున్న పాదయాత్ర నిన్నటితో 68 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్నికలలో అధికారం రావడానికి నేతలు ఎలాంటి వాగ్దానాలైన చేస్తారు, ఎలాంటి నినాదం అయినా పలుకుతారు అన్న విషయం మనకు తెలిసిందే. గత ఎన్నికలలో జాబు రావాలంటే బాబు రావాలి అన్న నినాదంను టీడీపీ నాయకులు యూత్ లోకి తీసుకెళ్ళి సత్ఫలితాన్నే పొందారు. అయితే దీన్నే జగన్ కొద్దిగా మార్చి బాబు పోవాలి జాబు రావాలి అని కొత్త నినాదంను సృష్టించారు.


నిన్న చిత్తూరు జిల్లా ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభ జరిగింది. ఆ సభలో జగన్ మాట్లడుతూ జాబు రావాలంటే బాబు రావాలి అని అన్నారు , కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే బాబు పోతేనే జాబులు వస్తాయి అన్నట్లుంది కాబట్టి బాబు పోవాలి జాబు రావాలి అని ఆయన విమర్శించారు. ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలను స్థాపిస్తే ఆ ప్రాంత వ్యక్తులకు ఆ కంపెనీ ఉద్యోగాలలో పెద్దపీఠ వేయాలి. కానీ ఇక్కడి శ్రీసిటీలో మాత్రం ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. స్థానికులకంటే స్థానికేతరులకు ఎక్కువ ఉద్యోగాలను కల్పిస్తున్నారు అని అయన చెప్పారు.వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా  స్థానికులకు 75 శాతం ఉద్యోగాలని వారి వారి ప్రాంతాలలో నెలకొల్పే ప్రైవేట్ సంస్థల్లో కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని కొందరు యువకులు జగన్ దృష్టికి తీసుకురాగా ఆయన ఈ మేరకు స్పందించారు.


శ్రీసిటీ ని దివంగతనేత  వైఎస్ నెలకొల్పారని ఆయన గుర్తుచేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ విషయంపై  యువతకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా కల్పించారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. అందులోనూ ఆంధ్రాలో యువతతో పాటు ధీటుగా నిరుద్యోగం కూడా ఉంది. ఒక వేళ జగన్ తాను చేసిన 75 శాతం హామీని నిలబెట్టుకుంటే మాత్రం 2019 ఎన్నికలే కాకుండా 2024 లోను చక్రం తిప్పడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: