కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా జరిగిన బంద్ లో అధికార టీడీపీ కూడా నేరుగా పార్టిసిపేట్ చేయడాన్ని బట్టి ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇన్నాళ్లూ బీజేపీతో జతకట్టేందుకు ఉత్సాహం చూపించిన వైసీపీ ఒక్కసారిగా స్టాండ్ మార్చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Image result for agitations over budget

          కేంద్రంలోని అధికార బీజేపీతో సన్నిహితంగా మెలగడం ద్వారా ఇటీవల వైసీపీ చాలా లబ్ది పొందింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేయబోతుందని అందరూ ఊహించారు.          జగన్ కూడా హోదా ఇస్తే బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఏమాత్రం అభ్యంతరం లేదని జాతీయ మీడియాతో కుండబద్దలు కొట్టారు. అటు కొంతమంది బీజేపీ నేతలు కూడా ఆచితూచి మాట్లాడారు. వైసీపీతో పొత్తు తమకు అభ్యంతరం లేదంటూనే .. అది ఎన్నికలప్పుడు అధిష్టానం చూసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇంతలే కేంద్ర బడ్జెట్ రావడం.. అందులో ఏపీకి గుండుసున్నా దక్కడంతో సీన్ మొత్తం మారిపోయింది.

Image result for agitations over budget

          కేంద్ర బడ్జెట్ అలా సభలో ప్రవేశపెట్టారో లేదో వెంటనే టీడీపీ అప్రమత్తమైంది. కేంద్రంలోని ఎన్డీఏకు చివరి బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ లో కాస్తయినా తమకు లబ్ది చేకూరుతుందని రాష్ట్రం భావించింది. అయితే ఏమాత్రం ప్రయోజనం కలగకపోవడంతో టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్ ను ప్రసంగించి బయటకు రాగానే జైట్లీకి సెగ తగలడం ప్రారంభమైంది. బడ్జెట్ లో ఏపీకి మొండిచేయే మిగిలిందంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. ప్రజానాడిని పట్టుకోవడంలో ముందుండే టీడీపీ వెంటనే కేంద్రానికి తమ అసంతృప్తిని ఎంపీలు, కేంద్ర మంత్రుల ద్వారా వ్యక్తపరిచింది.

Image result for agitations over budget

          వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధికార పార్టీ కంటే ముందే ఈ పని చేయాల్సింది. అయితే బీజేపీతో ఎలాగైనా జట్టు కట్టాలనుకుంటున్న వైసీపీ బడ్జెట్ పై సరైన అంచనాకు రాలేకపోయింది. బడ్జెట్ పై స్పందించేందుకు జగన్ మూడ్రోజులు వెయిట్ చేశారు. బడ్జెట్ పై మీ కామెంట్ ఏంటని ఓ మీడియా ఛానల్ ప్రశ్నిస్తే.. తర్వాత సమాధానం చెప్తానంటూ దాటవేశారు. అదే సమయంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బడ్జెట్ బాగుందంటూ ప్రశంసించారు. దీన్ని బట్టి ఆ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. బడ్జెట్ బాగాలేదంటే బీజేపీకి ఎక్కడ దూరమైపోతామో అనే భయం ఆ పార్టీని వెంటాడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని ధన్యవాదాలు చెప్తున్న సమయంలో వైసీపీ సభ నుంచి బయటికెళ్లిపోయింది. టీడీపీ వాళ్లు ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలితే.. తాము కూడా ఎక్కడ అందులో పాల్పంచుకోవాల్సి వస్తుందేమోనని వైసీపీ భయపడింది. అయితే ముందే కుదిరిన అవగాహన మేరకు ప్రధాని ప్రసంగానికి టీడీపీ అభ్యంతరం తెలపలేదు సరికదా ఎన్టీఆర్ ను పొగిడినప్పుడు చప్పట్లతో స్వాగతించింది.

Image result for agitations over budget

          బడ్జెట్ పై జరుగుతున్న ఆందోళనలో పార్టీలకు రేటింగ్ ఇస్తే టీడీపీ ఫస్ట్ ప్లేస్, కాంగ్రెస్ కి సెకండ్ ప్లేస్, వైసీపీకి థర్డ్ ప్లేస్ ఇవ్వచ్చు. వామపక్షాలది ఆ తర్వాతి స్థానం. కేవీపీ రామచంద్రరావు అలుపెరుగని పోరాటం కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చింది. ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఏపీ గురించి మళ్లీ మాట్లాడగలిగిదంటే అది జైట్లీ బడ్జెట్ పుణ్యమే.! కానీ బడ్జెట్ పై వైసీపీ ఎంత ప్రయత్నించినా ప్రజలను నమ్మించడంలో విఫలమైందనే చెప్పొచ్చు.    


మరింత సమాచారం తెలుసుకోండి: