ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జన సేన అధినేత అన్నారు. లంక భూముల రైతులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం ఆషామాషీ వ్యవహరం కాదని ప్రభుత్వానికి సూచించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ ఉగాది వేడుకల్లోనూ పాల్గొన్నారు.


రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు పవన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చిన భూములను పరిశీలించారు.  ఉద్ధండరాయుని పాలెంలో జరిగిన ఉగాది వేడుకల్లో ప్రసంగించారు. రాజధాని నిర్మాణంపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. రాత్రికి రాత్రి రాజధాని కట్టాలనే ఆకాంక్ష ఉన్నా ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం గౌరవించాలని పవన్ సూచించారు. అమరావతి నిర్మాణానికి ఎంత అవసరమో అంతే భూమి తీసుకోవాలని సలహా ఇచ్చారు. సింగపూర్ తరహా రాజధాని కావాలి అంటే ఆ తరహా పాలన కూడా అందించాలని చెప్పారు.


విశ్వ నగరం నిర్మించాలంటే అందుకు విశాలమైన మనసులు కూడా కావాలని పవన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కులాల గొడవ ఎక్కువ ఉందని పవన్ అన్నారు. కులాల గొడవ ఉన్నంత కాలం అమరావతి విశ్వ నగరంగా అభివృద్ధి చెందలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోకూడదని సూచించారు. లంక భూముల వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ అంశంపై జనసేన పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పోరాటం తన అభిమతం కాదని.. పనికిరాని విధానాలకు  వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేస్తానని తెలిపారు. తన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు లేవని పవన్ వెల్లడించారు.  సమస్యలు ఏవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఒకవేళ అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులను ప్రజల ముందు నిలదీస్తానని పవన్‌ ప్రకటించారు. సమస్య వచ్చినప్పుడు దానిని సానుకూలంగా పరిష్కరించుకోవాలని జన సేనాని సూచించారు. రాజకీయాల్లో వ్యక్తులతో తనకు గొడవలు ఉండవని తెలిపారు. పార్టీలు, మేధావులతో చర్చించి అమరావతి తుది డిజైన్లు ఖరారు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: