అమిత్ షా లేఖలోని అంశాలు: 

ఎన్డీయే నుంచి వైదొలగాలన్న టీడీపీ నిర్ణయం పూర్తిగా ఏకపక్షం. ఈ నిర్ణయానికి కారణంగా అభివృద్ధి అంశాలు కాకుండా పూర్తిగా రాజకీయ కారణాలుగానే కనిపిస్తున్నాయి. అభివృద్ధి, పనితీరు అన్నవే నినాదాలుగా మా పార్టీ పనిచేస్తుంది. ఏపీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో మోదీ సర్కారు నిబద్ధతతో పనిచేస్తోంది. విభజన సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు పరిరక్షించడంలో బీజేపీయే గట్టిగా నిలబడింది. విభజనను సరిగా నిర్వహించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల పట్ల ఏమాత్రం సానుభూతి చూపలేదు. ఆనాడు ఉభయ సభల్లో తెలుగుదేశం ఎంపీల సంఖ్య తగినంత లేకపోవడంతో, బీజేపీయే తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ పోరాడింది. ఆ తర్వాత దేశానికి సేవ చేసే అవకాశం మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్కింది. అప్పటి నుంచి విభజన కారణంగా ఇబ్బందులు పడ్డ ఏపీని ఆదుకుంటూనే ఉన్నాం

Image result for amit shah and chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల సానుభూతి, అభివృద్ధి పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తూనే వచ్చాం. విభజన చట్టంలో పేర్కొన్న దాదాపు అన్ని సంస్థలు, హామీలను కేంద్రం ఇచ్చింది. అయితే విభజన చట్టంలోని అంశాలేవీ బీజేపీ అమలు చేయలేదని, ఏపీ ప్రజల పట్ల సానుభూతి లేదని మీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. సహకార సమాఖ్య (కోఆపరేటివ్ ఫెడరలిజం) స్ఫూర్తితో మేం పనిచేస్తున్నాం. టీం ఇండియా అంటూ ప్రధాని అందరినీ కలుపుకుపోతూ పనిచేస్తున్నారు. అందుకే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గతంలో 32 శాతం ఉంటే మోదీ సర్కారు ఏకంగా 42 శాతానికి పెంచింది. తద్వారా రూ. 2 లక్షల కోట్లు అదనంగా రాష్ట్రాలకు అందుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేక సహాయం పొందింది. విభజన చట్టంలో ఉన్నవే కాదు, అంతకు మించి కూడా కేంద్రం ఏపీకి ఇచ్చింది. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కేంద్రం మరియు బీజేపీ నిజమైన మిత్రుడిగా ఉంది. ఏపీ ప్రజల శ్రేయోభిలాషిగా నిలిచింది.

Image result for amit shah and chandrababu

విభజన చట్టంలోని 14వ షెడ్యూల్ ప్రకారం విద్య, మౌలిక వసతుల కల్పనలో 11 విద్యాసంస్థలను 2022 నాటికి పూర్తిచేయాలని ఉంది. అందులో ఐఐటీ, ఎన్ఐటీ, త్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐపీఈ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ తరహా వైద్యవిద్యా సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేశాం. 2022 నాటికి పూర్తిచేయాల్సిన వాటిని చాలా ముందుగానే పూర్తిచేశాం. 8 మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చట్టం చెబుతోంది. అయితే వాటి విషయంలో ఏర్పాటు కోసం కేంద్రం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది

Image result for amit shah and chandrababu

కాకినాడ వద్ద గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్, విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా, విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయడం, కొత్త రాజధానికి ర్యాపిడ్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ పనులు పురోగతిలో ఉన్నాయి. అనంతపురం నుంచి అమరావతికి ఎక్స్ ప్రెస్ వే, కర్నూలు, కడప నుంచి కనెక్టివిటీకి రూ. 24,000 కోట్లు అంచనాతో ప్రాజెక్టు రెడీ అవుతోంది. దీనికి మొదట రాష్ట్ర ప్రభుత్వం భూమి ఉచితంగా ఇస్తామని చెప్పింది. కానీ తర్వాత భారత్‌మాల పరియోజన పథకం ప్రకారం 50 శాతం మాత్రమే ఇస్తామని తర్వాత చెప్పింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. అమరావతి చుట్టూ 180 కి.మీ.ల ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 19,700 కోట్లు ఖర్చవుతుంది. అమరావతి మీదుగా విజయవాడ, గుంటూరు రైల్వే లైన్ కోసం రూ. 2,680 కోట్లు ఖర్చు కానుంది. నడికుడి-శ్రీకాళహస్తి మధ్య కొత్త రైల్వే లైన్ కి రూ. 304 కోట్లు కేటాయించాం. గుంతకల్-గుంటూరు మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు రూ. 3,631 కోట్లు ఖర్చు కానుంది. విజయవాడ మెట్రోరైలుకు సూత్రప్రాయ ఆమోదం కూడా ఇచ్చాం. రూ. 6,769 కోట్లు ఖర్చు కానుంది. విశాఖ మెట్రో కోసం రాష్ట్రం నుంచే కొత్త ప్రతిపాదన అందాల్సి ఉంది.

Image result for amit shah and chandrababu

దుగరాజపట్నం వద్ద పోర్టు కుదరకపోతే వేరే ఎక్కడైనా నిర్మించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో టాస్క్‌ఫోర్స్ అధ్యయనం కూడా పూర్తయింది. లాభదాయకంగా ఎలా ఏర్పాటు చేయాలన్న విషయంపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీలు సెంటిమెంటును రెచ్చగొడుతూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరించడం బాధాకరం. ఆయా పార్టీలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంటుతో ఆడుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రూ. 22,113 కోట్లు 2015-2020 మధ్యకాలంలో రెవెన్యూ లోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం లెక్కించింది. ఆలోటు పూడ్చేలా పన్నుల్లో వాటా కేటాయింపులు కూడా జరిపింది. కేటాయింపుల్లో వాటా భారీగా పెంచిన తర్వాత కూడా కేంద్రం ప్రత్యేక ప్యాకేజి పేరుతో 2016 సెప్టెంబర్లో రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలను లెక్కించి, ఆ ప్రయోజనాలన్నీ ప్యాకేజీలో పొందుపరిచాం.

 Image result for amit shah and chandrababu

రెండేళ్ల తర్వాత ఒక్కసారిగా మీరు యూ-టర్న్ తీసుకుని ప్రత్యేక హోదా డిమాండ్ చేయడం సమంజసంగా లేదు. ప్యాకేజీ ప్రకారం ఈఏపీ ప్రాజెక్టు కింద రూ. 8,991.38 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కింద రూ. 17,236 కోట్లుగా లెక్కించడం జరిగింది. ప్యాకేజీ నిధులు విడుదల చేయడంలో జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వ తీరే కారణం. రాష్ట్రం వేగంగా స్పందించకపోవడం వల్లనే ప్యాకేజీ నిధులు విడుదల కాలేదు. ప్రజా ప్రయోజనాలే మీ ప్రాధాన్యత అనుకుంటే, నిధులు పొందే విషయంలో ఎందుకింత జాప్యం చేశారు? స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయడానికి ఎందుకు ఏపీ సర్కారు స్పందించడం లేదు? నాబార్డు నుంచి నేరుగా ఎస్పీవీకి నిధులు వచ్చేవి కదా? విభజన ఏడాది రెవెన్యూ లోటు విషయంలో మేం ఇప్పటికే రూ. 3,979.50 కోట్లు విడుదల చేశాం. అదనంగా మరో రూ. 1,600 కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు రుణమాఫీ ఖర్చులను కూడా కలిపి రూ 16,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం సమంజసం కాదు. మీ గణాంకాలు సరైనవి కావు. మా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ రుణమాఫీ చేసినప్పటికీ ఆ ఖర్చు పూర్తిగా రాష్ట్ర ఖజానాలే భరించాయి. రావాల్సిన సొమ్ము కంటే ఎక్కువగా అడిగి, అది ఇవ్వడం కుదరదు అనిపించుకోవడం కవ్వించి తప్పించుకోవడం కాదా?

 Image result for amit shah and chandrababu

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పారిశ్రామిక, పన్ను రాయితీలు కల్పిస్తూ 2016 సెప్టెంబర్ 30న సీబీడీటీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ మీరు ఎలాంటి పారిశ్రామిక, పన్ను రాయితీలు ఇవ్వలేదని చెప్పడం ఎంత వరకు సమంజసం? వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇప్పటి వరకు కేంద్రం రూ. 1,050 కోట్లు విడుదల చేయగా ఇందులో కేవలం 12శాతం మాత్రమే ఖర్చు చేశారు. మిగతా 88 శాతం నిధులు అలాగే ఉన్నాయి.రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లోనూ 219శాతం పెంపుదల చేశాం. రూ. 47,989 కోట్ల ఖర్చుతో 32 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.

 Image result for amaravati capital city

కొత్త రాజధాని

కొత్త రాజధానిలో రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మండలి వంటి భవంతులు, మౌలిక వసతుల నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే రూ. 2,500 కోట్లు విడుదల చేసింది. అందులో 1,000 కోట్లు పట్టణాభివృద్ధి శాఖ నుంచి విడుదలవుగా, కేవలం 8శాతం మాత్రమే ఖర్చు చేశారు. ఇచ్చిన నిధులు ఖర్చే చేయకుండా కేంద్రం నుంచి మరిన్ని నిధులు ఎలా అడుగుతారు?

 Image result for Polavaram

పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 16,010.45 కోట్లుగా అంచనా వేయగా, అందులో ఇర్రిగేషన్ కాంపోనెంట్ మొత్తం ఖర్చు కేంద్రం భరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే కేంద్రం రూ. 5,364 కోట్లు విడుదల చేసింది. ఇవిగాక, విభజన చట్టంలో లేనివి మరో రూ. 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించాం. రూ. 1 లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారులు, రూ. 1.4 లక్షల కోట్ల విలువ చేసే హెచ్.పీ.సీ.ఎల్, గెయిల్, ఓఎన్జీసీ పెట్రోలియం ప్రాజెక్టులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి రూ. 38,500 కోట్ల అదనపు పెట్టుబడి, సోలార్ పవర్ సెక్టార్లో రూ. 24,000 కోట్ల పెట్టుబడులు.

Image result for vizag railway zone

కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వచ్ఛభారత్ అభియాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి వివిధ పథకాల కింద పుష్కలంగా నిధులిచ్చాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రస్తావంచకుండా, తమ క్రెడిట్‌గా రాష్ట్రప్రభుత్వం చెప్పుకోవడం బాధ కలిగిస్తోంది. ఏపీ అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వం, పార్టీ చిత్తశుద్ధితో నిబద్ధతతో వ్యవహరిస్తుంది. దురదృష్టవశాత్తు విభజన రాజకీయాలతో మీ పార్టీ ఎన్డీయే నుంచి దూరమైంది. ఈ పరిణామాలెలా ఉన్నా, ఏపీ ప్రజల అభివృద్ధి విషయంలో బీజేపీ తన నిబద్ధత కొనసాగిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: