కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.222 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మే 15న  మొత్తం 2600 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. మే15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Image result for karnataka elections

5గంటల వరకు 64శాతం పోలింగ్ నమోదుకాగా.. ఆరుగంటల వరకూ ఓటర్లు క్యూలైన్ లో ఉన్నారు. సుమారు 70శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.  రామనగర్‌లో అత్యధికంగా 84శాతం, బెంగళూరు అర్బన్‌లో అల్పంగా 44శాతం ఓటింగ్ నమోదైంది. కర్ణాటకలో ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెట్టి.. ప్రచారం చేసిన బెంగళూరులో ఓటింగ్ గణనీయంగా పడిపోవడంతో గెలుపోటములపై ఓటింగ్ శాతం ప్రభావం చూపుతుందని పార్టీల్లో గుబులు పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రూరల్ నియోజకవర్గాల్లో అంచనాలకు మించి పోలింగ్ జరగడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నారు

Image result for karnataka elections

హుబ్లీలో వర్షం కారణంగా ప్రజలు ఓటు వేసేందుకు ఇబ్బందులు పడ్డారు. కల్బుర్గి జిల్లాలోని తర్కాస్పేట్ గ్రామంలోని మెజార్టీ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా ప్రకటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హంపి నగర్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని.. యినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కార్యకర్తలు మండిపడ్డారు.

Image result for karnataka elections

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పూర్తిమెజార్టీ సాధిస్తుందన్న సిద్ధరామయ్య.. బాదామి, చాముండేశ్వరి రెండు నియోజకవర్గాల్లోనూ తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఉపముఖ్యమంత్రి అభ్యర్థి బి.శ్రీరాములు బళ్లారిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేముందు 'గోపూజ' చేశారు. బాదామి నియోజకవర్గంలో సీఎం సిద్దరామయ్యపై  శ్రీరాములు పోటీ చేస్తున్నారు. బాదామి ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే బసవనగర్ లోని 108 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి, ఆయన భార్య అనిత రామనగరలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. జేడీఎస్ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందని కుమరస్వామి ధీమా వ్యక్తం చేశారు.

Image result for karnataka elections

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప శివమొగ్గలోని శిఖాపూర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధిస్తుందని.. సిద్ధరామయ్య రెండు చోట్ల ఓడిపోతారంటూ యడ్యురప్ప జోస్యం చెప్పారు. అటు కర్ణాటకలో ఎన్నికల ఫలితాలో దేశవ్యాప్తంగా భారీగా పెట్టింగులు జరుగుతున్నాయి. బాదామీ, బళ్లారితో పాటు కొన్ని కీలక నియోజకవర్గాలపై కోట్లలో పందాలు కాస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: