ఊహించినట్టే కర్నాటక గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అతిపెద్ద పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలూ తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. అయితే అతిపెద్ద పార్టీకే తొలి అవకాశమిచ్చారు గవర్నర్ వాజూభాయ్ పటేల్.

Image result for karnataka elections

          కర్నాటకలో కమలం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలిచింది బీజేపీ. అయితే అధికారానికి అవసరమైన 113 స్థానాలను దక్కించుకోవడంలో విఫలమైంది. కాంగ్రెస్ కు 78 స్థానాలు, జేడీఎస్ కు 38 స్థానాలు లభించాయి. దీంతో  ఏపార్టీ కూడా నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్.. ఓటమిని అంగీకరించి జేడీఎస్ కు మద్దతు పలికింది. బీఎస్పీతో కలిసి 38 స్థానాలు దక్కించుకున్న జేడీఎస్ అధినేత కుమారస్వామికి ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ వర్గంలో హుషారొచ్చింది. కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నందున తనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కుమార స్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Image result for karnataka elections

          కుమార స్వామి అపాయింట్ మెంట్ అడిగిన వెంటనే బీజేపీ అలెర్ట్ అయింది. గవర్నర్ అపాయింట్ మెంట్ కోరింది. గెలుపు ముంగిట బోల్తాపడిన ఆ పార్టీ.. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోంది. అతి పెద్ద పార్టీగా అవతరించినందున తప్పకుండా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందుకు సమ్మతించిన గవర్నర్ వాజీభాయ్ వాలా యడ్యూరప్పకు బలం నిరూపించుకోవాల్సిందిగా వారం రోజుల గడువు ఇచ్చారు.

Image result for karnataka elections

          బీజేపీకి గవర్నర్ అవకాశం ఇవ్వడంతో ఆ పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది. జేడీఎస్ లో చీలిక తెచ్చే అవకాశం ఉందని ఓ అంచనా. దేవెగౌడ పెద్ద కుమారుడు, కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వారిని తమ దరికి చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు ఢోకా ఉండకుండా చూసుకునేందుకు బీజేపీ ఎత్తుగడ వేసిందని సమాచారం. అదే జరిగితే బీజేపీకి పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. అయితే అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందనే మాట మరోసారి నిజం చేసుకున్నట్టవుతుంది. ఇప్పటికే బీజేపీపై సంఘ్ సిద్ధాంతాలను వదిలేసిందనే అపవాదు ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: