ప్రీ పోల్స్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని ఏ మాత్రం నిరాశపర్చకుండా కర్ణాటక 15వ అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయి. ముందు నుంచి ప్రచారం జరుగుతోన్న హంగ్ అసెంబ్లీ ఆవిష్కృతమైంది. 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దకాలం తర్వాత కర్ణాటకలో అధికార పగ్గాలు దక్కించుకునేందుకు సిద్ధమైంది. కర్ణాటకలో యెడ్యూరప్ప మూడోసారి ముఖ్యమంత్రి పగ్గాలు దక్కించుకునేలా కమలం మంత్రాంగం నడిపిస్తోంది. అధికారానికి కేవలం అరడజను సీట్లకు దూరంలో ఉన్న బీజేపీ బలనిరూపణకు సిద్ధమవుతోంది.

Image result for karnataka elections

కర్ణాటకలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందన్న అంచనాలు మొదటి నుంచీ ఉన్నాయి. మోదీ ఎన్నికల ప్రచారానికి రాక ముందు కొంచెం అనుమానాలతో ఉన్న బీజేపీ క్యాడర్.. మోదీ రంగంలోకి దిగాక గెలుపుపై ధీమాగా ఉంది… మోదీ ప్రచారంతో సర్వేలు సైతం సమూలంగా మారిపోయాయి. అప్పటి వరకూ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ను అంచనా వేసినవి కాస్తా., తారుమారయ్యాయి. మోదీ వాగ్ధాటిముందు రాహుల్ ప్రసంగాలు తెలిపోయాయి. ఎక్కిన ప్రతివేదికపైనా కాంగ్రెస్ ను మోదీ తూర్పారపట్టడంతో.., సిద్ధరామయ్య రెండోసారి అధికారంలో కొనసాగటం కష్టమనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. బీజేపీ మరోసారి కర్ణాటకలో కాళ్లూనకుండా చేయటానికి సీఎం సిద్ధరామయ్య వేయని ఎత్తులేదు. చేయని ప్రయత్నం లేదు. ఎలక్షన్ల నగారా మోగటానికి ముందే బీజేపీ సీఎం అభ్యర్థి యెడ్యూరప్ప ఓటు బ్యాంకును సిద్ధూ లక్ష్యంగా చేసుకున్నారు. లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానించటమే కాకుండా.., కేంద్రానికి నోట్ పంపారు. బీజేపీ ముందరి కాళ్లకు బంధం వేశారు. ఈ ఎత్తుతో లింగాయత్ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లీ.. యెడ్యూరప్ప ఇమేజ్ ఎందుకూ కొరగాకుండా పోతుందని భావించారు. కానీ ఫలితాలు చూస్తే జరిగింది అందుకు పూర్తి విరుద్ధం…

Image result for karnataka elections

కర్ణాటక అసెంబ్లీలో లింగాయత్ ల ప్రాబల్యం ఉన్న 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీజేపీ స్పష్టమైన ఆధిక్యం చూపించింది. దాదాపు 35 కు పైగా లింగాయత్ ప్రాబల్య సీట్లలో పాగా వేసింది. ప్రత్యేక మతంగా గుర్తిస్తే., లింగాయత్ లు నెత్తినపెట్టుకుంటారని ఆశించిన కాంగ్రెస్ కు ఆ సామాజికవర్గం నుంచి ఆదరణ కరువైంది. కేవలం 20 లింగాయత్ సీట్లతోనే కాంగ్రెస్  సరిపెట్టుకుంది. ఒక్కళిక వర్గానికి చెందిన జేడీఎస్ అరడజను లింగాయత్ ప్రాబల్య కోటల్లోనే పాగా వేసింది… కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న దళిత, ముస్లీం ప్రాబల్య ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఎదురే లేకుండా పోయింది. దళితులు-ముస్లీంలు ఎక్కువగా ఉన్న కోస్తా కర్ణాటక, బొంబై కర్ణాటక, హైద్రాబాద్ కర్ణాటకల్లో కమలం పూర్తి స్థాయిలో వికరసించింది. పాతమైసూరు ప్రాంతాన్ని మినహాయిస్తే., అత్యధిక స్థానాలున్న బొంబై కర్ణాటకలో 50 సీట్లకుగాను, బీజేపీ 32 చోట్ల పాగా వేసింది.  కోస్తా కర్ణాటకలో 19 సీట్లు ఉంటే., 15 చోట్ల కమలమే రెపరెపలాడింది. హైద్రాబాద్ కర్ణాకటలోని 40 సీట్లలో 16 చోట్ల బీజేపీ పాగా వేసింది. రెడ్డి బ్రదర్స్ ప్రాబల్యం బలంగా ఉన్న మధ్య కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఏమాత్రం నిలువరించలేకపోయింది. ఇక్క ఉన్న 26 సీట్లకు 20 సీట్లను బీజేపీ దక్కించుకుంది. మోదీ ప్రభంజనానికి, రెడ్డి బ్రదర్స్ అడ్డా అంతటా కమల వికాసమే కనిపించింది…

Image result for karnataka elections

ఒక్క పాత మైసూరు ప్రాంతంలో మాత్రమే బీజేపీ ప్రతికూల ఫలితాల్ని నమోదు చేసింది. 57 సీట్లు ఉన్న ఈ  ప్రాంతంలో కమలం కేవలం 12 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ – జేడీఎస్ హావాను అధిగమించలేకపోయింది. కర్ణాటక మొత్తంలో పాత మైసూరు ప్రాంతంలోనే బీజేపీ పూర్తిగా వెనకబడింది. ఇక్కడ బీజేపీ మెరుగైన సీట్లు దక్కించుకుని ఉంటే., హంగ్ అసెంబ్లీకి అవకాశమే ఉండేది కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా బీజేపీ అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్ లపై స్పష్టమైన ఆధిపత్యాన్ని నమోదు చేసింది. దాదాపు 154 గ్రామీణ నియోజకవర్గాల్లో 71 చోట్ల బీజేపీ సత్తా చాటింది. అధికారంలోకి వస్తే., లక్షన్నర రూపాయలకు పైగా ఉన్న రైతురుణాల్ని మాఫీ చేస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానం రైతులు ఎక్కువగా ఉండే గ్రామీణ నియోజకవర్గాల్లో బాగానే ప్రభావం చూపింది. కర్నాటక ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా దాదాపు 72.47 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామీణులు రికార్డు స్థాయిలో ఓటింగ్ దిగటంతో బీజేపీ  అందరికంటే ఎక్కువగా సీట్లు గెలుచుకుని అతిపెద్దపార్టీగా అవతరించేలా చేసింది.

Image result for karnataka elections

30 అసెంబ్లీ సీట్లున్న బెంగళూరు నగర నియోజక వర్గాల్లో కూడా బీజేపీ ఏమాత్రం వెనకబడలేదు. పోలింగ్ రోజున కేవలం 45 శాతం మందే తమ ఓటు హక్కును వినియోగించుకోవటంతో., ఇక్కడ బీజేపీకి ప్రతికూల పవనాలు ఉండొచ్చని అంతా అంచనా వేశారు.  పైగా బెంగళూరు నగరపాలక సంస్థలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇలా ఏరకంగా చూసిన నగరంలోని సీట్లలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమికే మెరుగైన ఫలితాలు ఉంటాయని భావించారు. కానీ అనూహ్యంగా ఇక్కడ కూడా బీజేపీ ప్రభావం చూపించింది. కాంగ్రెస్ తో సరిసమానంగా 12 సీట్లను గెలుచుకుంది. జేడీఎస్ ను కేవలం 4 సీట్లకే పరిమితం చేసింది… దళిత ఓటు బ్యాంకును కొల్లగొట్టడంలో కూడా బీజేపీ, కాంగ్రెస్ కన్నా ఏ మాత్రం తక్కువ ఫెర్ఫార్మ్ చేయలేదు. దళిత సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న 38 సీట్లలో 14 చోట్ల కమలం పాగా వేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా దళితులపై దాడుల విషయంలో కర్ణాటక నుంచే బీజేపీ ఎక్కువ కార్నర్ అయింది. అలాంటి రాష్ట్రంలో బీజేపీ దళితులసీట్లలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే పాగా వేయటంతో., దేశవ్యాప్తంగా దళితులు బీజేపీని వ్యతిరేకిస్తున్నారనే విమర్శలకు కాలం చెల్లినట్లైంది…

Image result for karnataka elections

ఓటు షేరింగ్ పరంగా చూస్తే బీజేపీ, కాంగ్రెస్ కన్నా బాగా వెనకబడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 36.5 శాతం ఓట్లతో 104 సీట్లను గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం 38 శాతం ఓట్లను సాధించింది. కానీ 78 సీట్లకే పరిమితమైంది. 2013 ఎన్నికలతో పోల్చుకుంటే., బీజేపీ మెరుగైన ఓటు బ్యాంకునే నమోదు చేసుంది. ఐదేళ్ల క్రితం 19.9 శాతంగా ఉన్న ఓటు బ్యాంకును ఈ ఎన్నికల్లో రెట్టింపు చేసుకుంది. అయినా కాంగ్రెస్ కన్నా మెరుగైన ఓట్ల శాతాన్ని సాధించకలేకపోయింది… 2014 ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గిపోయింది. 28 లోక్ సభ సీట్లున్న కర్ణాటకలో బీజేపీ 46 శాతం ఓట్లను, 17 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ లెక్కన చూస్తే., బీజేపీ 132 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటాలి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పదే పదే బీజేపీ 150 సీట్లలో పాగా వేస్తుందని ధీమాగా చెప్పుకొచ్చారు. కానీ ఫలితాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. 2014 నుంచి 2018 మధ్యలోనే కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పడిపోయింది. దాదాపు 8 శాతం పతనమైంది. మోదీ హావా ప్రభంజనంలా ఉందని కమల దళం ప్రచారం చేసుకుంటున్న టైం లోనే.. బీజేపీ ఓట్ల శాతం ఘోరంగా పతనమైంది. 2019 లోక్ సభ ఎన్నికలకు ఏడాది ముందు ఇలాంటి ప్రతికూల పవనాలు కమలనాథుల్ని కొంత కలవరపాటుకు గురిచేసేవే…

Image result for karnataka elections

దక్షిణాదిలో తమ జైత్రయాత్రకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నాంది కాబోతున్నాయని చెప్పుకున్న బీజేపీ నాయకులకు హంగ్ అసెంబ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. 2008లోనూ మ్యాజిక్ మార్కుకు మూడు నాలుగు సీట్ల దూరంలోనే ఆగిపోయిన బీజేపీ...,, కాంగ్రెస్ , జనతా దళ్ ఎస్ నుంచి ఎన్నికైన అభ్యర్థులకు వలవేసి  విశ్వాసపరీక్ష నెగ్గింది. వాళ్లచేత రాజీనామా చేయించి, బీజేపీ టిక్కెట్టుపై గెలిపించుకోవటం ద్వారా వివాదాలు రాకుండా చూసుకుంది. తిరిగి పదేళ్ల తర్వాత బీజేపీ ముందు సరిగ్గా అలాంటి పరిస్థితే పునరావృతమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: