దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. కర్నాటక ఎన్నికలు కూడా ముగియడంతో ఇక దృష్టంతా సార్వత్రిక ఎన్నికల పైనే.! ఇప్పటికే దేశవ్యాప్తంగా దండయాత్ర చేస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి మరోసారి హస్తినపీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మళ్లీ అధికారంలోకి రావాలంటే మిగిలిన రాష్ట్రాలకంటే ఎక్కువగా ఒక్క రాష్ట్రంపైనే దృష్టి పెట్టబోతోంది బీజేపీ. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి బీజేపీ పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. 2014లో మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఉత్తరప్రదేశ్‌ పైనే ప్రధానంగా దృష్టి  పెడుతున్నారు. ఈ మధ్య జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ- బహుజన్‌ సమాజ్‌పార్టీలు దోస్తీ కట్టి బీజేపీని చావుదెబ్బ తియ్యడం, 2019లో కూడా కలిసే పోటీ చేస్తామని ప్రకటించి సవాల్‌ విసరడంతో దానిని ఎదుర్కొనేందుకు బీజేపీ ఓ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది.

Image result for bjp uttar pradesh

ఇన్నాళ్లూ ఎస్పీకి బలంగా ఉన్న ఓబీసీలను చీల్చెయ్యాలని బీజేపీ ప్లాన్‌. రాష్ట్రంలోని 82 ఓబీసీ కులాలనూ మూడు కేటగిరీలుగా వర్గీకరించనున్నారు. ఓబీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్లు సరిసమానంగా అందాలంటే ఈ వర్గీకరణ తప్పనిసరనేది బీజేపీ నేతల వాదన. లోక్‌సభ ఎన్నికలకు ఆరు నెలల ముందుగా ఈ వర్గీకరణ చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఓబీసీలను వెనుకబడ్డ, చాలా వెనుకబడ్డ, అత్యంత వెనుకబడ్డ.. అనే మూడు కేటగిరీలు చేయనున్నారు. మొదటి దానిలో 4, రెండో దానిలో 19, మూడో దానిలో 59 కులాలను చేరుస్తున్నారు. ఈ వర్డీకరణ గనక జరిగితే అది యాదవులకు రాజకీయంగానూ, ఓబీసీలో ప్రాబల్యపరంగానూ గట్టి దెబ్బ తీస్తుందని విశ్లేషకుల భావన. నిజానికి 27 శాతం కోటాలో ఎక్కువగా లాభపడుతున్నది యాదవ కులస్థులే. ఇది మిగిలిన వర్గాల అసూయకు కారణమవుతోంది. ఈ కోపమే 2014లోనూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి కలిసొచ్చింది.

Image result for bjp uttar pradesh

వచ్చేఎన్నికల్లో రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అమిత్‌ షా ఇప్పటికే యూపీ బీజేపీ నేతలను ఆదేశించారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రెండు చోట్లా వారిని ఓడిస్తే అది మానసికంగా కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసినట్ల్లవుతుందని ఆయన అంచనా. ఎన్నికలకు ముందు నుంచే ఆ రెండు నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా ర్యాలీలు తీయాలని, ప్రతీ రోజూ ఏదో ఒక యాక్టివీటీ ఉండాలని, గాంధీల వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం.

Image result for bjp uttar pradesh

బీజేపీ ప్రయోగించబోతున్న మరో అస్త్రం ఏంటంటే- 17 ఓబీసీ కులాలను షెడ్యూల్డ్‌ కులాల్లో చేర్చాలన్నది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే కేంద్రానికి పంపారు. నిజానికి ఈ కులాలను ఎస్సీల్లో చేర్చాలని 2004 నుంచీ సమాజ్‌వాదీ పార్టీ పోరాడుతోంది. ములాయం, అఖిలేష్‌ యాదవ్‌లిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు మూడుసార్లు ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపారు. కానీ కేంద్రం దానిని తిరస్కరిస్తూ వచ్చింది.  కేటగిరీ మార్పుకి ఎస్పీ అనుకూలంగా ఉన్నా.. బీఎస్పీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది దళితుల రిజర్వేషన్లను నీరుగార్చడమేనని, దీనికి బదులు వారి రిజర్వేషన్‌ శాతాన్ని 21 శాతం నుంచి పెంచాలని మాయావతి డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఇపుడు బీజేపీ తెలివిగా ఈ అంశాన్ని చేపట్టనుంది. ఒకవేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే అది ఎస్పీ-బీఎస్పీలకు దెబ్బే.. ఓబీసీలు, దళితులు ఎస్పీ-బీఎస్పీ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నం చేసినట్లేనని ఎస్పీ వర్గాలంటున్నాయి. మొత్తం మీద యూపీలో ఓబీసీ, దళిత ఓటుబ్యాంకులనే బీజేపీ టార్గెట్‌ చేస్తోంది. ఈ రెండు వర్గాలకు 60 శాతం పైగా సీట్లుడటమే అందుకు కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: