ఉద్ధానం కడ్నీ సమస్య తీర్చకపోతే తాను నిరాహార దీక్షకు కూర్చుంటానని చంద్రబాబునాయుడును జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ బుధవారం పలాసలో మాట్లాడుతూ, ఉధ్ధానం సమస్య పరిష్కారంపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదంటూ మండిపడ్డారు. సమస్య పరిష్కారినికి తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి ఉద్ధానంలో రీసెర్చి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అమెరికన్ డాక్టర్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ధ్వజమెత్తారు. సమస్య పరిష్కారంపై వెంటనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రితో ఓ కమిటి వేయాలని కూడా సూచించారు. అయితే, పవన్ మరచిపోయిన విషయం ఒకటుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బిజెపి ఎంఎల్ఏ కామినేని శ్రీనివాసరావు రాజీనామా చేయటంతో ఆ శాఖ చంద్రబాబు వద్దే ఉంది. తన డిమాండ్లపై చంద్రబాబు వెంటనే స్పందిచకపోతే యాత్రను నిలిపేసి నిరాహార దీక్షకు కూర్చోవటానికి కూడా వెనకాడేది లేదంటూ పవన్ చేసిన హెచ్చరికలు రాష్ట్రంలోను, టిడిపిలోను సంచలనంగా మారింది.

సమస్య ఏమీ తీరలేదు
మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో జరిగిన ధర్మపోరాటంలో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కు ఏమాట్లాడాలో కూడా తెలీటం లేదని, స్క్రిప్ట్ లేందే పవన్ ఏమి మాట్లాడలేరంటూ ఎద్దేవా చేశారు. అదే సమయంలో కేంద్రపై తాను పోరాటం చేస్తుంటే పవన్ మాత్రం తనను ఉద్దేశించి ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే పవన్ ఈరోజు చంద్రబాబును ఉద్థానం సమస్యను కేంద్రంగా చేసుకుని హెచ్చరికలు చేసినట్లు కనబడుతోంది.

ప్రభుత్వం హడావుడి
ఉద్థానం కిడ్నీ సమస్య ఈరోజుది కాదు. దశాబ్దాల తరబడి ఉన్న కడ్నీ సమస్యను ఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోలేదు. అదే సమయంలో టిడిపి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోలేదన్నది వాస్తవం. చంద్రబాబుకు మిత్రునిగా ఉన్నపుడు పవన్ లేవనెత్తిన సమస్యపై అప్పట్లో ప్రభుత్వం కాస్త హడావుడి మాత్రమే చేసింది. మిత్రుడు పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకా అన్నట్లుగా అప్పట్లో కామినేని శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. తర్వాత ఆ ప్రకటనలన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. పవన్ కూడా మళ్ళీ ఉద్థానం సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కాకపోతే తన పర్యటన కారణంగా మళ్లీ ఇంత కాలానికి పవన్ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ఉద్థానం సమస్య చర్చకు వస్తోంది.

5/
5 -
(1 votes)
Add To Favourite