కర్నాటకలో కుమార స్వామి ప్రమాణస్వీకారోత్సవం కచ్చితంగా దేశ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఘనత కచ్చితంగా కుమారస్వామికి దక్కుతుంది. వచ్చే ఎన్నికల్లో ఈ పరిణామం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపిస్తోంది.


కర్నాటక 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం బెంగళూరులో ఘనంగా జరిగింది. విధాన సౌధ ఎదుట ప్రమాణస్వీకారోత్సం జరిగింది. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వజూభాయీ వాలా వీరి చేత ప్రమాణం చేయించారు.. ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణం చేశారు. 25వ తేదీన బలనిరూపణ చేసుకోవాలని కుమారస్వామి భావిస్తున్నారు. అనంతరం వారం రోజుల్లోపు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.. కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది, జేడీఎస్ నుంచి 12 మంత్రి వర్గంలో ఉండే అవకాశం ఉంది.


  కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, కేరళ సీఎం పినరయి విజయన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాక ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడీయూ అధినేత శరద్ యాదవ్, లెఫ్ట్ పార్టీల నేతలు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, డి.రాజా, ఆర్జేడీ శాసనసభా పక్ష నేత తేజస్వీ యాదవ్ సహా పలువురు ముఖ్య పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరోజు ముందే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరు వెళ్లి కుమారస్వామికి మద్దతు ప్రకటించారు.


  ప్రమాణస్వీకారానికి ముందు, ఆ తర్వాత కూడా పార్టీల నేతలంతా ఉత్సాహంగా కనిపించారు. సోనియా, రాహుల్ తదితరులు వివిధ పార్టీల నేతల దగ్గరకు వెళ్లి పలకరించారు. విభాదాలు మరిచి అన్ని పార్టీల నేతల దగ్గరకూ వెళ్లి కరచాలనం చేశారు. బెంగాల్ లో బద్దవిరోధులుగా ఉన్న మమత – లెఫ్ట్ పార్టీల నేతలు ఇక్కడ వేదిక పంచుకోవడం విశేషం. అంతేకాక.. ప్రమాణ స్వీకారం అనంతరం ఒకరనొకరు పలకరించుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. పైగా బీజేపీకి వ్యతిరేకంగా నాలుగేళ్లుగా ఒక్క పార్టీ కూడా నోరు మెదపలేదు. అయితే ఎన్డీయే నుంచి బయటికొచ్చి తొలిసారి మోదీపై టీడీపీ తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత పార్టీలన్నీ కూటమి కట్టేందుకు ముందుకొచ్చాయి. ఇదే ఉత్సాహం, సమన్వయం మున్ముందు కూడా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: