ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ తో రాజీనామాలు చేసిన ఐదుగురు వైసిపి ఎంపిల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతాయా ? జ‌ర‌గ‌వా ? ఇదే అంశం రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ రాజీనామాలు ఆమోదం  పొందాల‌ని, ఉప ఎన్నిక‌లు రావాలని వైసిపి నేత‌లు కోరుకుంటున్నారు. అదే స‌మ‌యంలో ఉప ఎన్నిక‌లు రాకుండా ఉంటే బాగుంటుంద‌ని టిడిపి నేత‌లు అనుకుంటున్నారు. టిడిపి ఎందుక‌లా కోరుకుంటోందంటే క్షేత్ర‌స్ధాయిలో ప‌రిస్ధితులు అలాగున్నాయి కాబ‌ట్టి. ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ సెంటిమెంటు ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది కాబ‌ట్టి ఉప ఎన్నిక‌ల్లో త‌మ గెలుపుకు ఎటువంటి ఢోకా ఉండ‌ద‌ని వైపిపి వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అదే స‌మ‌యంలో నాలుగేళ్ళ చంద్ర‌బాబు నాయుడు  ప్ర‌భుత్వంపై జ‌నాల్లో క‌న‌బ‌డుతున్న వ్య‌తిరేక‌త వ‌ల్ల త‌మ గెలుపు ఖాయ‌మ‌ని రాజీనామాలు చేసిన ఎంపిలు కూడా గ‌ట్టిగా అనుకుంటున్నారు. 

Image result for ycp mps

క్షేత్ర‌స్ధాయిలో ఎవ‌రికి అనుకూలం  ?

ఇక‌, టిడిపి విష‌యానికి వస్తే, క్షేత్ర‌స్ధాయిలో పరిస్ధితులు ఏమంత అనుకూలంగా లేవ‌న్న‌ది వాస్త‌వం.  ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ తో వైసిపికి చెందిన నెల్లూరు ఎంపి మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి, తిరుప‌తి ఎంపి వ‌ర‌ప్ర‌సాద్, క‌డ‌ప ఎంపి అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపి మిధున్ రెడ్డి రాజీనామ‌లు చేయ‌టం త‌ర్వాత ఏపి భ‌వ‌న్లో నిరాహార దీక్ష చేయ‌టం అంద‌రికీ తెలిసిందే. ఎంపిల రాజీనామాలు ఆమోదం పొందితే పై నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు. టిడిపికి ఇపుడ‌దే స‌మ‌స్య‌గా మారింది. హోదాపై జ‌నాల్లో నిజంగానే సెంటిమెంటు ఉంటే ఉప ఎన్నిక‌లు జ‌రిగితే మ‌ళ్లీ వైసిపి ఎంపిలే విజయం సాధించ‌టం క‌ష్ట‌మేమీ కాదు. మ‌రి, సెంటిమెంటు లేక‌పోతే ? 

Image result for ycp mps

వ్య‌తిరేక‌త సంగ‌తి ఏంటి ?
ప్ర‌త్యేక‌హోదా సెంటిమెంటు జ‌నాల్లో ఉందో లేదో ఉప ఎన్నిక‌ల్లో తేలిపోతుంది.  అంత వ‌ర‌కూ బాగానే ఉంది. సెంటిమెంటు సంగ‌తిని ప‌క్క‌న పెడితే,  ప్ర‌భుత్వంపై జ‌నాల్లో వ్య‌తిరేక‌త మాటేంటి ? జ‌నాల్లో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తుంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. ఎందుకంటే, పోయిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన అనేక హామీల్లో ఏ ఒక్క‌టీ సంపూర్ణంగా అమ‌లు కాలేదు. కాపుల‌ను బిసిల్లో చేర్చ‌టం, బోయ‌ల‌ను ఎస్టీల్లో చేర్చ‌టం, నిరుద్యోగ భృతి, ప్ర‌త్యేకహోదా, విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ప్ర‌త్య‌క‌రైల్వే జోన్, రాజ‌ధాని నిర్మాణం లాంటి హామీల‌కు మొద‌ట‌డుగే ప‌డ‌లేదు. దానికితోడు చంద్ర‌బాబు వైఖ‌రి వ‌ల్ల అనేక సామాజిక వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. ఈ విష‌యాలే టిడిపి నేత‌ల్లో ఆందోళ‌న పెంచుతోంది.

Image result for special status agitation ap

ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌వుః ఖురేషి

రాజీనామాలు చేసిన వైసిపి ఎంపిల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు లేవ‌ని చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ గా ప‌నిచేసిన ఖురేషి అభిప్రాయ‌ప‌డ్డారు. ఖురేషి మీడియాతో మాట్లాడుతూ, రాజీనామాలు ఆమోదం పొందినా సాధార‌ణ ఎన్నిక‌లు ఏడాదిలోపే ఉంటుంది కాబ‌ట్టి ఉప ఎన్నిక‌లు జ‌రపే అవ‌కాశాలు త‌క్కువ‌ని చెప్పారు. ఈనెల 29వ తేదీన స్పీక‌ర్ తో ఎంపిలు స‌మావేశ‌మ‌వ్వ‌నున్నారు. రాజీనామాల ఆమోదం విష‌యంలోనే స్పీక‌ర్ తో వీరి భేటీ ఉంటుంద‌న్న స్ప‌ష్టంగా తెలుస్తోంది. రాజీనామాల‌కే ఎంపిలు ప‌ట్టుబ‌డ‌తారు కాబ‌ట్టి భేటీ తర్వాత ఏదో ఒక రోజు ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల క‌మీష‌న్ కు విష‌యం చెప్పాలి. అప్పుడు ఎన్నిక‌ల క‌మీష‌న్ నిర్ణ‌యం తీసుకుంటుంది. 

Image result for former cec Khureshi


మరింత సమాచారం తెలుసుకోండి: