ఈ నాలుగేళ్లలో మోదీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు పట్టాలెక్కాయి. కేవలం దేశంలో మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా మోదీ నామస్మరణే.! ఆయన పథకాలు సక్సెస్ అయ్యాయా.. లేదా .. అనే విషయాలను పక్కనపెడితే మోదీ చేపట్టిన సంస్కరణలు మాత్రం భారత్ రూపు మార్చేశాయి. సబ్ కా సాత్ - సబ్ కా వికాస్, స్వచ్ఛ్ భారత్, జన్ ధన్ యోజనా, ముద్రా యోజనా.... ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే ప్రధానిగా పగ్గాలు చేపట్టాక మోదీ ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ ఇన్నీ కావు. భారతదేశంలో పాత పథకాల బూజు దులిపేస్తూ, కొత్తచిట్టాతో బీజేపీకి విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించారు. కాంగ్రెస్ మార్కు మాయం చేయటం లో ఆయన ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, వాజ్ పేయి ఫసల్ బీమా యోజనా, స్మార్ట్ సిటీలు, అమృత నగరాలు, ఉజ్వల్, ఉడాన్ యోజనలు దేశంలో ఎన్డీయే పేరు మార్మోగించాయి. ఈ నాలుగేళ్ల కాలంలో విదేశీ పర్యటనలు, సరిహద్దుల్లో సర్జికల్ స్ట్రైకులు మోదీ ఛరిష్మాను ఇంటా – బయటా హోరెత్తించాయి.

Image result for modi schemes

ప్రజలు కలలు గంటున్న మంచి భారతాన్ని మనం కలిసి నిర్మించుకుందామంటూ మనకీ బాత్ లతో మోదీ మారుమూల గ్రామాల్లోని ప్రజలకు కూడా చేరువయ్యేందుకు తొలి రెండేళ్లను  పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. ప్రజల సంపూర్ణ సహకారం, మద్దతు సాధించుకున్నారు. ఫలితంగా 2014లో 11 రాష్ట్రాల్లో మాత్రమే అధికారానికి పరిమితమైన బీజేపీని కేవలం నాలుగేళ్ల వ్యవధిలో 21 రాష్ట్రాలకు విస్తరించుకోగలిగారు. ‘దేశ పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం అంటూ అందుకు ఆయన చాలా పథకాల్ని తెరపైకి తెచ్చారు. ఉజ్వల్‌ ద్వారా విద్యుత్‌ బోర్డుల సమూల ప్రక్షాళన జరిగి, భారతదేశంలో ప్రతి మారుమూల గ్రామం విద్యుత్ సౌకర్యం పొందింది. ఈ ఘనత నిస్సందేహంగా మోదీ ప్రభుత్వానిదే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దీన్నే ఆయన ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారు. మీరు 48 ఏళ్లలో చేయలేనిది,  నేను 48 నెలల్లో సాధించాను అంటూ కాంగ్రెస్ ను ఏడాది ముందు నుంచే కార్నర్ చేయటం మొదలుపెట్టారు…

Image result for modi schemes

మాటల్ని తూటాల్లో పేలుస్తూ.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన మోదీ.. ప్రధానిపగ్గాలు చేపట్టిన నాటినుంచి అవే మాటల్ని జనాలపై ప్రయోగిస్తూ.. తనపైనా, తన నాయకత్వంపైనా ప్రజల్లో విశ్వాసం పాతుకుపోయే చర్యలకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. స్వఛ్ భారత్ అంటూ మోదీ చీపుల్ని పట్టుకుని రోడ్డు మీదకు వచ్చి.. దేశంలో శుభ్రత మీద అందరి దృష్టీ పడేలా చేశారు. దిగ్గజ వ్యాపారవేత్తలు, సినిమాస్టార్లను విస్తృతంగా రంగంలోకి దించి.. భారతదేశం పట్ల విదేశీయుల్లో పాతుకుపోయిన తిరస్కార భావనల్ని దూరం చేసే కార్యక్రమాన్ని ఉద్యమ పంథాలో చేపట్టారు. భారతదేశంలో బహిరంగ మలమూత్ర విసర్జనపై యుద్ధం ప్రకటించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రతి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కేరళ, ఏపీ, గుజరాత్.. సహా అనేక రాష్ట్రాల్లో బహిరంగమలమూత్ర విసర్జన రహిత రాష్ట్రాలుగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారకుండా అలాగే ఉన్నాయి. రద్దీగా ఉంటే నగరాల్లో ఆడవాళ్లు ఇప్పటికీ అత్యవసరాలు తీర్చుకోవటం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ ఆరంభశూరత్వంగానే మిగిలిపోయింది…

Image result for modi schemes

స్మార్ట్ సిటీలు, అమృత్ నగరాలు ఇలా దేశంలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని  ప్రాంతాల అభివృద్ధి సైతం ప్రశ్నార్థకంగానే మిలిగిపోయింది. లిస్ట్ లో పేరు సంపాదించటం కోసం రాష్ట్రాలు  పోటీ పడినా.. కేంద్రం నుంచి నిధుల్ని సాధించుకోవటంలో, వినియోగించుకోవటంలో చాలా రాష్ట్రాలు ఇంకా వెనకబడే ఉన్నాయి. ఆయా పథకాలు ప్రచారఆర్భాటానికే పరిమితం అనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి… తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించిన మోదీ.., అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో తిరిగిన విదేశాలకు లెక్కే లేదు. 17 ఏళ్ల భారతదేశాన్ని ఏకధాటిగా ఏలిన నెహ్రూను మించి మోదీ అనేక దేశాల్లో అడుగుపెట్టారు. ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ .. ఇలా గ్లోబులో ప్రతి మూలలోనూ మోదీ అడుగుపెట్టారు. మోదీ డైనింగ్ టేబుల్ పై కూర్చుకున్నా.. సీటు బెల్టు కోసం వెతుక్కుంటారని.. విపక్షాలు ఆయన విదేశీ పర్యటనలపై వ్యంగోక్తులు విసిరే లెవల్లో యాత్రలు చేశారు. భారతదేశాన్ని ప్రపంచదేశాలకు దగ్గర చేయటంతోపాటు, మేకిన్ ఇండియా వంటి తన నినాదాల్ని, విదేశాలకు అధునిక భారతదేశ విధానాలుగా పరిచయం చేయటంలో విజయం సాధించారు…

Image result for modi foreign visits

మోదీ విదేశీ పర్యటనలు అంతర్జాతీయంగా, వాణిజ్యపరంగా ఇండియా కు మంచి అవకాశాలన్ని కల్పించటంతోనే ఆగిపోలేదు. సరిహద్దుల్లో చైనా – పాకిస్తాన్ వంటి దేశాలు సృష్టించే ఉధృక్తల్ని దృఢ చిత్తంతో ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా అందించాయి. 1947లో దేశ విభజన తర్వాత కాశ్మీర్ ఇండో-పాక్ ల మధ్య రావణకాష్టంగా రగులుతూనే ఉంది. పాక్ ప్రోద్బలంతో అనేక తీవ్రవాద సంస్థలు ఆజాద్ కాశ్మీర్ కేంద్రంలో భారతదేశాన్ని బలహీనపర్చే కుట్రలు నిర్విరామంగా చేసుకుపోతున్నాయి. వాటి నిలువరించే ప్రయత్నాలు మోదీ సర్కార్ వచ్చాక జరిగినట్లు.. మునుపెన్నడూ జరగలేదనేది నిర్వివాదాంశం…

Image result for modi oath taking ceremony

మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన వెంటనే కాశ్మీర్ లో తీవ్రవాదం ఏరివేతకు కీలక ప్రాధాన్యం కల్పించారు. ఉగ్రవాదాల్ని పెంచిపోషిస్తున్న నాయకత్వాన్ని నామ రూపాల్లేకుండా ఏరివేస్తున్నారు. ప్రపంచదేశాలు, పాక్ సైనిక నియంతలు ఊహకు కూడా అందకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిక్షణ శిబిరాల్ని ధ్వంసం చేసి., మిమ్మల్ని సరిహద్దులు ఆవల కూడా వెంటాడి చంపేస్తామంటూ గట్టి హెచ్చరిక చేసిన తొలి ప్రధాని నిస్సందేహంగా మోదీనే… డోక్లాంలో భూటాన్ భూభాగాన్ని కబ్జా చేయటానికి వచ్చిన చైనాను నెలల తరలబడి నిలువరించి.., రెడ్ ఆర్మీ దూకుడుకి ముకుతాడు వేశారు. సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించేకోవటమే ఏకైక ఆప్షన్ అనే విషయాన్ని ఆసియా పెద్దన్నగా చలామణీ కావాలని చూస్తున్న చైనాకు అర్థమయ్యేలా చేశారు. ఇరుదేశాలు యుద్ధం అంచుల వరకూ వెళ్లినా.. చైనా చర్చలకు దిగివచ్చేవరకూ సైనిక మోహరింపుల్ని కొనసాగించారు. ప్రపంచంలో భారత్ నాలుగో అతిపెద్ద సైనిక శక్తి అనే విషయాన్ని డ్రాగన్ మర్చిపోకుండా డోక్లాంలో నిలువరించారు. దేశంలోనూ.. విదేశాల్లోనూ భారత్ ఓ బలమైన శక్తి అనే విషయాన్ని అందరూ గుర్తించేలా చేయటంలో మోదీ నాలుగేళ్ల పాలన గణనీయ పాత్ర పోషించింది…


మరింత సమాచారం తెలుసుకోండి: