కేంద్రప్రభుత్వం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా సీఎం చంద్రబాబునాయుడు నవ నిర్మాణ దీక్ష పేరుతో విజయవాడలో దీక్షకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే  నవ నిర్మాణ దీక్ష పేరుతో బాబు ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా వంచనపై గర్జన తో దీక్ష ను చేపట్టింది. నిన్న నెల్లూరు వీఆర్‌ కళాశాల గ్రౌండ్‌లో జరిగిన ఈ దీక్షకు వైసీపీ కీలక నేతలంతా హాజరయ్యారు. 


కాగా ఈ దీక్షకు కమెడియన్ పృథ్వి కూడా హాజరయ్యారు. దీక్షలో మాట్లాడిన ఆయన బాబుపై నిప్పులు చెరిగారు. నేనేదో థర్టీ ఇయర్స్ అంటూ సినిమాల్లో చెప్పుకొని బతుకుతున్నా, బాబు వచ్చి ఫోర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. మరి రాజకీయాల్లో నలభై ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పుకొని తిరిగే చంద్రబాబు నలభై ఏళ్ళ జగన్ అన్నను చూసి ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలని ఎద్దేవా చేసాడు. ప్రజలలో మమేకం కావాలి, జగన్ వల్ల కొన్ని విషయాలను నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే తాను మొన్న జగన్ తో కలిసి పది కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.


పాదయాత్రలో పాల్గొన్న జనసందోహం వల్ల  కృష్ణమ్మ వారధి కంపించగా దాన్ని టీడీపీ నేతలు గ్రాఫిక్స్ అని విమర్శించారని, వారి విమర్శలకు ఓటర్లే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆయన తెలియజేసారు. ఒక  కార్యకర్తగా తాను ఒక అజెండా పెట్టుకున్నానని తెలిపిన ఆయన, తాను మరికొందరు కలిసి నృత్య రూపకం, నాటకం తయారు చేశామని వీటిని త్వరలో ప్రతి మండలానికి వెళ్లి ప్రదర్శనలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నాటక రూపంలో చెబుతామని సభాముఖంగా తెలియజేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: