ఆంధ్రప్రదేశ్ లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ఆ అశాంతిని తగ్గించుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏకంగా మోదీని రంగంలోకి దించబోతోంది. బీజేపీపై టీడీపీ చేస్తున్నదంతా అసత్య ప్రచారమని, రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధికి నిధులు కేటాయించామని కమలం పార్టీ చెప్పుకుంటోంది. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మోదీ చేతే తిప్పికొట్టాలనుకుంటోంది.

Image result for tdp bjp

          నాలుగేళ్లుగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీ – టీడీపీలు ఉమ్మడిగా అధికారంలో ఉన్నాయి. అయితే రాష్ట్రానికి తగిన న్యాయం చేయడంలో బీజేపీ విఫలమైందంటూ ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చింది. ఇటు రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. అనంతరం రెండు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది. నాలుగేళ్లలో రాష్ట్రానికి బీజేపీ ఏమాత్రం న్యాయం చేయలేదని టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ధర్మపోరాట దీక్షలు చేస్తోంది. విభజన సమయంలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

Image result for ap bjp

          అయితే టీడీపీ ఆరోపణలను బీజేపీ అంతే స్థాయిలో తిప్పికొడుతోంది. లక్షల కోట్ల రూపాయలు నిధులను ఏపీకి కేంద్రం కేటాయించిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు యూసీలు పంపించామని, ఏ రాష్ట్రానికి లేని నిబంధనలు ఏపీకి మాత్రమే ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రానికి ఏం చేశారో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమని టీడీపీ నేతలు చెప్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటలయుద్ధం తీవ్రమైంది.

Image result for kadapa steel plant

          బీజేపీని టీడీపీ బద్నాం చేస్తోందనుకుంటున్న కమలం పార్టీ నేతలు సైకిల్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి మోదీని తీసుకురావాలనుకుంటున్నారు. విభజనచట్టంలో పేర్కొన్న ప్రధాన హామీల్లో ఒకటైన స్టీల్ ప్లాంట్ ను కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుంది. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మోదీని తీసుకొచ్చి రాష్ట్రానికి చేసిన మేలును వివరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్లాన్ చేస్తోంది. మోదీని రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఒకింత పాజిటివ్ అట్మాస్పియర్ కలుగుతుందనే భావనలో బీజేపీ ఉంది.

Image result for tdp bjp

          బీజేపీకి ఏపీలో ఇప్పుడు జీవన్మరణ సమస్య ఏర్పడింది. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందనే ఫీలింగ్ లో రాష్ట్ర ప్రజలున్నారు. ఇప్పుడు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఇప్పుడు బీజేపీ వేయబోతున్న ఈ ఎత్తుగడలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: