రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుండడం, శరవేగంగా పరిణామాలు మారుతుండడంతో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ ఇవాల్టి సమన్వయ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించింది. నేతల అలసత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోనని ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు.

 

నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. నవ నిర్మాణ దీక్షలు, మహా సంకల్ప దీక్షల ద్వారా కేంద్రం కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ధర్మ పోరాట దీక్షలను కంటిన్యూ చేయాలని సమావేశం నిర్ణయించింది. మూడో ధర్మ పోరాట దీక్షను రాజమండ్రి వేదికగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత రాయలసీమలో మరో సభ నిర్వహించాలని తీర్మానించారు. అంతేకాక.. యూనివర్సిటీల్లో 10 సభలను నిర్వహించాలని కూడా నిర్ణయించారు. నేతల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలు ఇప్పటి వరకూ సరిగా పని చేయకపోయినా మారుతారులే అనే భావనతో కామ్ గా ఉన్నానని, ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఎవరు ఏంచేస్తున్నారో నివేదికలు ఉన్నాయన్నారు. ఇకపై నేను తీసుకునే చర్యలకు నేతలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇకపై ప్రజాప్రతినిధులందరూ గ్రామదర్శిని పేరుతో గ్రామాల్లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. పార్లమెంట్ పరిధిలో సమకాలీన రాజకీయాలపై 3 రోజులపాటు కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

 

జిల్లాల్లో సమావేశాలకు నేతలు గైర్హాజరు కావడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఎందుకు హజరుకాలేదని జిల్లా అధ్యక్షులను అడిగిన తెలుసుకున్నారు. అంత బిజీగా ఉన్నారా అని ప్రశ్నించారు. నాకు పనిలేక ఈ సమావేశానికి వచ్చానా.. అని నిలదీశారు. రెండు గంటలు కూడా సమావేశానికి రాని వాళ్ళకు పదవులు అవసరమా? అని గట్టిగా అడిగారు. అలసత్వం వహించే లీడర్లపై జిల్లా అధ్యక్షులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సమగ్ర నీటి నిర్వహణపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పోలవరం-పట్టిసీమల వల్ల జిల్లాల వారీగా కలిగే లబ్ధిని నేతలకు వెల్లడించారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చే ఉద్యమంలో పార్టీ నేతలు భాగస్వాములు కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ముందు మీకు తెలిస్తే.. వాటిని మీరు గ్రౌండ్ లెవల్ కు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్తున్నానన్నారు. గ్రామాల్లో తిరగటం కొందరు నేతలు మర్చిపోతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. నీటి నిర్వహణపై జిల్లాల వారీగా కరపత్రాలు ఇస్తే బాగుంటుందని జేసీ దివాకర్ రెడ్డి సూచించారు. అయితే కరపత్రాలకంటే గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తేనే మంచి ఫలితం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. వారంలో ఒక రోజైనా గ్రామ దర్శిని పేరిట ప్రతి నేతా గ్రామాల్లో తిరగాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేద్దామన్నారు.

 

ధర్మ పోరాట సభలు రెండింటిలో ఒకటి రాయలసీమలో మరొకటి ఉత్తరాంధ్ర లో నిర్వహించామన్నారు. మూడో ధర్మ పోరాట సభ రాజమండ్రిలో గోదావరి తీరాన పెడితే బాగుంటుందని నేతలు సూచించారు. ఈ నెలలో మూడో సభ నిర్వహణకు స్థానిక నేతలతో మాట్లాడి తేదీ ఖరారు చేద్దామని చంద్రబాబు సూచించారు. ఆ తర్వాత కర్నూలు లేదా అనంతపురంలో సభ నిర్వహిద్దామన్నారు. ఎన్నికల లోపు అన్ని జిల్లాల్లోనూ ధర్మ పోరాట సభలు పూర్తి చేద్దామన్నారు. చివరి సభను విజయవాడ-గుంటూరు కలిపి భారీ ఎత్తున నిర్వహిద్దామని చెప్పారు. దళిత తేజం సమావేశాన్ని ఈ నెల 23న నెల్లూరులో నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. దళితనేతల ఢిల్లీ టూర్ పైన కూడా సమావేశంలో చర్చించారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు అని, ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు మరింత యాక్టీవ్ కావాలని చంద్రబాబు సూచించారు. ఇంచార్జ్ మంత్రులు జిల్లాల్లో తమ తమ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలని కోరారు.

 

సమన్వయ కమిటీ సమావేశంలో యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దీనిపై పార్టీ కేడర్ ని పూర్తిగా అప్రమత్తం చేయాలని కోరారు. ఎన్నికల సంఘం సహా అన్ని వ్యవస్థలనీ కేంద్రం తన నియంత్రణలో పెట్టుకుంటోందన్నారు. ఇక్కడ ఈవీఎంలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని... నేతలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. యనమల వ్యాఖ్యలను సమర్థించిన చంద్రబాబు.. ఈవీఎంల పనితీరుపై జాతీయస్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా బ్యాలెట్ ని ఉపయోగిస్తున్నారని, ఇదే సరైనది అని టీడీపీ మొదటి నుంచి చెప్తోందన్నారు. ఈ అంశాన్ని జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మార్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వాస్తవానికి వచ్చే మే లోపు ఎన్నికలు పూర్తికావాలని, ఒకవేళ ముందే కూడా జరగొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేనికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. 


ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడుతూ, అవినీతి ఆరోపణలు చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు చెప్పారు. బీజేపీ, వైసీపీ కలిసి చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని సూచించారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ కన్నా లక్ష్మినారాయణ వైసీపీ ప్రయోజనాలకోసం పని చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. నిరాధారమైన ఆరోపణలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు. ప్రపంచంలో రెండు భిన్న ధృవాలైన అమెరికా అధ్యక్షుడు,  ఉత్తర కొరియా అధ్యక్షుడు శాంతి కోసం సింగపూర్ ని వేదికగా ఎంచుకున్నారన్నారు. అలాంటి సింగపూర్ ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా నమ్మి సహకరిస్తోoదని గుర్తు చేశారు. అలాంటి సింగపూర్ పై విపక్షాలు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: