దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న నేపథ్యంలో ఎన్నికలను ముందుగానే నిర్వహించే ఆలోచనలో కమలదళం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలనూ నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో ఏపీ, తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలు ఎవరికి లాభించే అవకాశముంది.

Image result for one nation one election

          గత కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక గాలి బలంగా వీస్తోంది. దేశవ్యాప్తంగా ఏ ఉపఎన్నిక జరిగినా అక్కడ బీజేపీ ఓడింది. సిట్టింగ్ స్థానాలను సైతం నెగ్గలేకపోయింది. సింపతీ కూడా వర్కవుట్ కాలేదు. మరోవైపు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటి చేజారిపోతున్నాయి. టీడీపీ కటీఫ్ చెప్పి బయటికి వచ్చేయగా, శివసేన ఈసారి కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చేసింది. ఇక మిగిలింది చిన్నాచితకా పార్టీలు మాత్రమే.! అదే సమయంలో దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ అధికార బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయి. మోదీ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, అప్రజాస్వామికంగా రాష్ట్రాల్లో పార్టీలను దెబ్బతీస్తున్నారని భావిస్తున్న పలు రాజకీయ పార్టీలు బీజేపీని ఈసారి ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఇది బీజేపీకి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Image result for duel elections

          ఎన్నికల్లో వరుస పరాభవాలు, విపక్షాలన్నీ ఏకతాటిపైకి నడుస్తున్న తీరుతో బెంబేలెత్తిపోతున్న బీజేపీ కొత్త అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది. వ్యతిరేక పవనాల నుంచి వీలైనంత తక్కువగా బయటపడేందుకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరంలలో ఈ ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరగాలి. ఈ నాలుగింటిలో ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని సర్వేలు చెప్తున్నాయి. ఇదే జరిగితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం తప్పదు. అందుకే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరిపితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉంది.

Image result for one nation one election

          వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కూడా ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి ఎన్నికలకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు. అయితే ఇది బీజేపీకి ఎంతమాత్రం మేలు చేస్తుందనేది తెలియాల్సి ఉంది. వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నవేళ, వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్న సమయంలో బీజేపీ ప్రయత్నాలు పెద్దగా ఫలించబోవనేది విశ్లేషకుల అభిప్రాయం. మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించినంత మాత్రాన బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదనే వాదన వినిపిస్తోంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!!

Image result for one nation one election

మరింత సమాచారం తెలుసుకోండి: