కేంద్ర గ‌నులు,  ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ పై  టిడిపి ఎంపిలు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర‌మంత్రిని ఎంపిలు ఢిల్లీలో క‌లిశారు. ఫ్యాక్ట‌రీ  ఏర్పాటుపై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అయితే, స‌మావేశంలో ఎంపిలు ఆశించిన మేర‌కు కేంద్ర‌మంత్రి  స్పందించ‌లేద‌ని ఎంపిలు మండిప‌డుతున్నారు. ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటులో జ‌రుగుతున్న జాప్యంపై ఎంపిలు కేంద్ర‌మంత్రిని నిల‌దీశారు. ఫ్యాక్ట‌రీ ఏర్పాటు ఎప్ప‌టిలోగా మొద‌లుపెడ‌తారో చెప్పాలంటూ ఎంపిలు నిల‌దీయ‌గా కేంద్ర‌మంత్రి తోసిపుచ్చారు. 


ఎంపిలు అడిగిన‌ట్లు, ఆశించిన విధంగా తాను స‌మాధానం చెప్ప‌లేనంటూ కేంద్ర‌మంత్రి ఎంపిల‌తో తెగేసి చెప్ప‌టం విశేషం. ఫ్యాక్ట‌రీ ఏర్పాటుపై కేంద్రం అడిగిన సందేహాల్లో కొన్నింటికే రాష్ట్ర‌ప్ర‌భుత్వం స‌మాధానాలు ఇచ్చింద‌ని  మంత్రి చెప్పారు.  కేంద్రం లేవ‌నెత్తిన 9 అంశాల్లో 2 అంశాల‌పై ఇంకా స‌మాధానం కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం నుండి త‌మ‌కు అందాల్సిన స‌మాధానం రాన‌పుడు ఫ్యాక్ట‌రీ ఏర్పాటుపై తాను ఏ విధంగా హామీ ఇవ్వ‌గ‌ల‌నంటూ కేంద్ర‌మంత్రి అడ్డం తిరిగారు.


కేంద్ర‌మంత్రితో భేటీ త‌ర్వాత మ‌చిలీప‌ట్నం ఎంపి కొన‌క‌ళ్ళ నారాయ‌ణ మాట్లాడుతూ,  బీరేంద్ర స్పంద‌నపై మండిప‌డ్డారు. కేంద్ర‌మంత్రితో జ‌రిగిన స‌మావేశంపై తాము పూర్తిగా అసంతృప్తితో ఉన్న‌ట్లు చెప్పారు. ఏదో ఒక కార‌ణం చెబుతూ  ఫ్యాక్ట‌రీ ఏర్పాటు విష‌యంలో కేంద్రం జాప్యం చేస్తున్న‌ట్లు ఎంపి ఆరోపించారు.  ఎప్ప‌టిలోగా ఫ్యాక్ట‌రీ నిర్మాణం మొద‌ల‌వుతుందో చెప్ప‌మంటే కేంద్ర‌మంత్రి చెప్ప‌లేదంటూ ధ్వ‌జ‌మెత్తారు కొన‌క‌ళ్ల‌.


మరింత సమాచారం తెలుసుకోండి: