కార్పొరేట్ కాలేజీల ధనదాహం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పోటీ ప్రపంచంలో తమ పేరు ప్రతిష్టలకోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీకేజీ కేసులో కార్పొరేట్ కాలేజీల హస్తం వెలుగుచూసింది. తమ కాలేజీ విద్యార్థికే టాప్ ర్యాంక్స్ వచ్చాయని చెప్పుకోవడానికి అడ్డగోలు వ్యవహారానికి తెరదీసిన వ్యవహారం సీఐడీ విచారణలో వెలుగుచూసింది.

Image result for ts eamcet

          తెలంగాణ ఎంసెట్ పేపర్ 2 లీకేజీ కేసులో శ్రీచైతన్య కాలేజీ డీన్ ఒలేటి వాసుబాబును అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. ఇదే కేసులో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్న వెంకట శివనారాయణను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ లోని శ్రీచైతన్య కాలేజీ చైతన్యపురి బ్రాంచ్ కు వాసుబాబు డీన్ గా వ్యవహరిస్తున్నారు. మరో 6 బ్రాంచ్ లకు కూడా ఈయన డీన్ గా ఉన్నట్టు సమాచారం. వీళ్లిద్దరూ ప్రధాన నిందితుడితో సంబంధాలు కలిగి ఉన్నట్టు వాళ్ల కాల్ డేటా ఆధారంగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాతే అరెస్ట్ చేశారు.


          ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ లీక్ అయినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేలింది. అలా అమౌంట్ వసూలు చేసిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురికి టాప్ ర్యాంక్స్ వచ్చినట్లు విచారణలో తేలింది. మరో ముగ్గురికి కూడా మంచి ర్యాంకులు దక్కాయి. ఆరుగురు విద్యార్థులకు ముందే పేపర్ అందడం వల్లే వారికి మంచి ర్యాంకులు వచ్చాయని విచారణలో వెల్లడైంది.

Image result for sri chaitanya collegeImage result for sri chaitanya college

          ఇప్పటికే అరెస్ట్ అయిన వారిచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు వాసుబాబు, వెంకట శివనారాయణలను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాసుబాబును హైదరాబాద్ లో, వెంకట శివనారాయణను గుంటూరులో అరెస్ట్ చేశారు. లీకేజీ నిందితులతో వీరిద్దరూ టచ్ లో ఉన్నట్టు వీళ్ల కాల్ రికార్డులు కూడా ధృవీకరించాయి. ఒడిషా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా ఈ లీకేజీ జరిగినట్టు తేలింది.


          లీకేజీ వ్యవహారంలో శ్రీచైతన్య కాలేజీ డీన్, శ్రీచైతన్య-నారాయణ కాలేజీల ఏజెంట్ హస్తం ఉన్నట్టు తేలడంతో మరోసారి కార్పొరేట్ కాలేజీల అడ్డగోలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ లీకేజీని ఆయా కాలేజీల యాజమాన్యాలు వెనకుండి నడిపించాయా.. లేకుంటే వ్యక్తిగతంగా వీరు డీల్ చేశారా.. అనేది తెలియాల్సి ఉంది. దీనిపై మరింత విచారణ జరగాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: